Sea Plane Services From Vijayaada to Srisailam: ఏపీ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి విజయవాడ నుండి శ్రీశైలం వరకు సీ ప్లేన్ సేవలు ప్రారంభించారు. విజయవాడలోని పున్నమి ఘాట్ ఇందుకు వేదికైంది. ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సీ ప్లేన్‌లో ప్రయాణించి శ్రీశైలం చేరుకున్నారు. దేశంలోనే తొలిసారిగా సీ ప్లేన్ సర్వీసెస్ పర్యాటక రంగానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చంద్రబాబు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. భవిష్యత్‌లో ఇక ఏ ఇజం ఉండదని, టూరిజం మాత్రమే ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో తాను ఐటి సేవలు వినియోగంలోకి తీసుకొచ్చినప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఐటి రంగంలో మన వాళ్లే ఉన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇదే విషయాన్ని చెబుతూ భవిష్యత్‌లో సీ ప్లేన్ సేవలు కూడా అలాగే విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు.
ఏపీలో గత ఐదేళ్లలో పాలనలో విధ్వంసం జరిగిందని, వెంటలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలు తమ ఓటు హక్కుతో ఆక్సీజన్ అందించారని అన్నారు. ఇకపై శ్రీశైలం కూడా తిరుమల తరహాలో అభివృద్ధి చేయడం జరుగుతుందని చంద్రబాబు తెలిపారు.