Free Gas Cylinder: ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం.. బుకింగ్స్ ఎప్పటినుంచంటే..?
Free gas cylinder scheme in AP: సూపర్ సిక్స్‌లో తొలి హామీ అయిన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
Free gas cylinder scheme in AP: సూపర్ సిక్స్‌లో తొలి హామీ అయిన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు దీపావళి కానుకగా ఉచిత సిలెండర్ల పథకాన్ని అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 తేదీ నుంచి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లను ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఏడాదికి 2 వేల 684 కోట్ల ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలియచేశారు. మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం దీపం పథకం గొప్ప ముందడుగని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే 5 సంతకాలతో మేనిఫెస్టో హామీలను, అన్న క్యాంటీన్ల వంటి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లోని పథకాల అమలును మొదలు పెట్టింది. మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మేరకు దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నెల 31 తేదీ నుంచి ఈ పథకాన్ని మొదలు ప్రారంభించనున్నారు.
సచివాలయంలో ఈ అంశంపై పౌరసరఫరాల శాఖతో సమీక్షించిన సీఎం, అక్టోబరు 31 తేదీ నుంచి పథకాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీపావళి నుంచి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగు అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని, ఈనెల 31వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభింస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలని, ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చామని. ఇప్పుడు మళ్లీ మూడు గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం అన్నారు. వంట గ్యాస్ కోసం వెచ్చించే ఖర్చును గృహిణులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చని సీఎం అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడంలో ఇలాంటి పథకాలు దోహదం చేస్తాయని సీఎం అన్నారు.