సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. నివర్ తుపానుపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చ జరిగింది. భారీ వర్షాలకు సుమారు 40 వేల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్టు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందినట్టు తెలిపారు. దీంతో డిసెంబర్ 15 లోగా పంటనష్టంపై అంచనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జనవరి 2021 నాటికి పరిహారం చెల్లించాలని జగన్ సూచించారు. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని ఆదేశించారు సీఎం జగన్.
పేదలకు డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 30 లక్షల 20వేల మంది లబ్దిదారులకు డీ-ఫాం పట్టాలు అందించనుంది జగన్ సర్కార్. 28 లక్షల 30 వేల మంది లబ్దిదారులకు జగనన్న కాలనీల పేరుతో లే అవుట్ల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 21 నుంచి భూముల రీ-సర్వేకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే డిసెంబర్ 8న 2లక్షల 49 వేల మంది లబ్దిదారులకు గొర్రెలు, మేకల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.