AP Assembly Session: 20 వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Session: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి.

Update: 2021-05-12 08:50 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (ఫైల్ ఇమేజ్)

AP Assembly Session: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు ఏపీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం దీనిపై నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అయితే ఒక్కరోజే అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి మార్చిలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కరోనా, ఎన్నికల కారణంగా సాధ్యపడలేదు.. దీంతో మార్చి నెలాఖరులో బడ్జెట్ ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు నెలల కాలానికి ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. రూ.80వేల కోట్ల నుంచి రూ.90వేల కోట్ల వరకు మూడు నెలల బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, నవరత్న పథకాల అమలుకు ఈ నిధులు వినియోగిస్తారు. వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్‌ను రూపొందించారు. మూడు నెలల సమయం ముగియనుండటంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నారని సమాచారం.

బ‌డ్జెట్ తొలి రోజు గవర్నర్ బిశ్వ‌భూష‌న్ ప్రసంగం ఉంటుంది. అనంతరం ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలుపుతాయి. అలాగే, బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, మండలిలో చల్లా రామకృష్ణారెడ్డిలకు సంతాపం ప్రకటిస్తారు. త‌ర్వాతి రోజు బ‌డ్జెట్టును ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News