Andhra Pradesh: జగన్ ప్రధాని కావాలనుకుంటున్నారు: వైసీపీ ఎంపీ
Andhra Pradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మరోసారి టార్గెట్ చేశారు ఆ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మరోసారి టార్గెట్ చేశారు ఆ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు. జగన్ నిర్లక్ష్యం వల్లే 46 మంది పేషెంట్లు చనిపోయారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇస్తున్నామంటూ జగన్ చేసిన ప్రకటనపై కూడా ఆయన మండిపడ్డారు. జగన్ ఏమైనా ఆయన జేబులో నుంచి డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఏపీలోని ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితులకు తీరని అన్యాయం జరుగుతోందని ఈ అరాచకాలను పట్టించుకునే వారే లేరని రఘురాజు మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని.. ఈ కేసులను జగన్ పై పెట్టాలని రఘురాజు అన్నారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకోకుండా... కూడబెట్టిన డబ్బులతో ప్రధాని కావాలనుకుంటున్నారని ఆయన కోరికను పైనున్న దేవుళ్లు, ఆయన నమ్మిన ఏసు క్రీస్తు కూడా అంగీకరించరని వ్యాఖ్యానించారు. కరోనా బాధితులకు రాష్ట్రంలో తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు.
జగన్ కు ఈ దేశ ప్రధాని కావాలనే ఆకాంక్ష ఉందని చెప్పుకొచ్చారు. కరోనా లెక్కలపై కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెపుతోందని దుయ్యబట్టారు. కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే లాక్ డౌన్ పెట్టకుండా,కర్ఫ్యూ పెట్టడమేంటని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలు, శవాలతో వ్యాపారం చేయడం అత్యంత దారుణమని అన్నారు.