AP Elections: ఏపీ ప్రభుత్వానికీ..ఎస్ఈసీ కి మధ్య సయోధ్య నిలిచేనా?

AP Elections: కోర్టు ధిక్కరణ కేసు పెట్టిన ఎస్ఈసీ * 2020 డిసెంబర్ లో నీలం సాహ్ని పదవీ విరమణ

Update: 2021-02-25 05:51 GMT
CS AND SEC (ఫైల్ ఇమేజ్)

AP Elections: ఏపీలో పంచాయితీ ఎన్నికల పర్వం విజయవంతం అయ్యింది. తొలుత నువ్వా నేనా అనుకున్న సీఎం, ఎస్ఈసీ నెమ్మదిగా షేక్ హ్యండ్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నో ప్రాబ్లం అంటున్నారు. ఇక్కడి వరకు బావుంది. మరి గతంలో హైకోర్టులో వేసుకున్న కేసుల సంగతి ఏంటి? ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు ఆ కేసులు ప్రభుత్వం, ఎస్ఈసీ నడుమ మళ్లీ మొదటి పరిస్థితికి తెస్తుందా..? 

పంచాయితీ ఎన్నికల నిర్వహణకు పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేదీ, ఏపీ సీఎస్ గా నీలం సాహ్ని ససేమిరా అన్నారు అప్పట్లో. వారిపై ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ కేసు పెట్టారు. అది వాదనల స్టేజీలో ఉండగానే నీలం సాహ్ని పదవీ విరమణ జరిగిపోయింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సీం జగన్ నీలం సాహ్నికి అవకాశం ఇచ్చారు. ఆమె తరువాత జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాధ్ దాస్.. ఏపీకి సీఎస్ గా వచ్చారు.

ఆదిత్యనాథ్ దాస్ కు నీలం సాహ్నికి మధ్య ఆలోచనలలో చాలా మార్పు ఉంది. ప్రభుత్వ ఆలోచనలు ఎస్ఈసీకి అర్ధమయ్యేలా చేయడానికి ఆదిత్యనాథ్ దాస్ మంత్రాంగం ఫలించింది. గవర్నర్ ను వారధిగా చేసి దాదాపు ఎస్ఈసీకి, సీఎం జగన్ కు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసారు. సీఎం జగన్ కూడా ఎన్నికలకు సై అనాలని మంత్రులకు సూచన చేయడంతో ప్రివిలేజ్ కమిటీ కూడా కిమ్మనలేదు. పంచాయితీ ఎన్నికలలో అధికారులు, ప్రభుత్వం ఎంతో సహకరించారంటూ ఎస్ఈసీ కితాబిచ్చారు.

ఐతే, ఎస్ఈసీ నెల రోజుల ముందు వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అందులో అప్పటి సీఎస్ నీలం సాహ్ని, పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది బాధ్యులుగా ఉన్నారు. వాదనలు విన్న ధర్మాసనం. వచ్చే నెల 22 కు కేసును వాయిదా వేసింది. అంతా సుఖాంతం అనుకుంటుంటే.. ఈ కేసుతో సీన్ రిపీట్ అయ్యేటట్టుంది.

ఇప్పుడు ఈ కేసు విషయంలో వెనక్కు తగ్గకుండా ఎస్ఈసీ పట్టుపడితే... మరి వెనక్కు తగ్గిన మంత్రులు మళ్ళీ రంగంలోకి వస్తారా..? మునిసిపల్ సమరం రచ్చ రచ్చగా మారనుందని వస్తున్న వాదనలు లేకపోలేదు. ప్రభుత్వం మళ్లీ ఎస్ఈసీతో గవర్నర్ నట్టింట మంతనాలు జరుపుతుందా? అంటే ఈ నెలాఖరుకు అదే జరగనుందని సమాచారం. అయితే.. ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకు ఇప్పుడు ప్రభుత్వం అడ్డు తగలనపుడు.. కేసు విత్ డ్రా చేసుకోవడంలో ఎస్ఈసీ సంశయం ఏమిటని రాజకీయ విశ్లేషకుల సందేహం.

Tags:    

Similar News