వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన ఆరోపణలపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు నిమ్మాడలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిని అచ్చెన్నాయుడు బెదిరించారంటూ నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు నిమ్మాడలో ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలోని వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, ఆయనపై పెట్టిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ హింసాకాండపై ప్రశ్నించడమే అచ్చెన్న చేసిన తప్పా? అని ప్రశ్నించారు. అచ్చెన్న ఇంటిపైకి కత్తులు, రాడ్లతో దాడికి వచ్చిన వైసీపీ నేతలపై కేసు పెట్టకుండా అచ్చెన్నపై పెడతారా? అని నిలదీశారు. ఆయన అరెస్ట్ జగన్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.