Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక దోపిడీ
Andhra Pradesh: ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రూ.200 అదనంగా వసూలు
Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో కార్పొరేట్ ఇసుక దోపిడీ మొదలైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మించి 200 అదనంగా వసూళ్లు చేస్తోంది జేపీ వెంచర్స్. దీంతో జిల్లాలో ఇసుక ధరలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.
ఏపీలో టన్ను ఇసుక ధరను ప్రభుత్వం 375 రూపాయలుగా నిర్ణయించింది. కానీ కార్పోరేట్ సంస్థకు ఇసుక కాంట్రాక్ట్ అప్పగించిన తర్వాత ఆ ధర 475కు పెరగగా.. 5 శాతం జీఎస్టీతో ధర 5 వందలకు చేరింది. ఇసుక ఎక్కడి నుంచి తెచ్చి అమ్మినా ఇదే ధరకు అమ్మాలనే నిబంధన కూడా పెట్టింది ప్రభుత్వం. కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఓపెన్ రీచ్‌లలో 550 నుంచి 6 వందల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. డిసిల్టేషన్ పేరుతో రాజమండ్రి గోదావరిలో.. కోనసీమలోని గోదావరి పాయల నుంచి సేకరించే ఇసుక ధర టన్నుకు 675 రూపాయలకు పెంచారు. ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చి.. రేటు ఫిక్స్ చేసినా తాము సూచించిన ధరలకే ఇసుక సరఫరా చేయాలని స్పష్టం చేశారు.
ఇక ప్రభుత్వం చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదంటున్నారు టీడీపీ నేతలు. తమ ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇస్తే అవినీతి ముద్ర వేసి.. ఇప్పుడు వైసీపీ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.
రాజమండ్రిలో బోట్స్ మెన్ సొసైటీలకు సంబంధించి ఎనిమిది ఇసుక ర్యాంపులున్నాయి. ఈ సొసైటీలకు టన్ను ఇసుక తరలిస్తే ప్రభుత్వం 214 రూపాయలు చెల్లించేది. ఇప్పుడు దాన్ని 170కి తగ్గించింది జేపీ వెంచర్స్ సంస్థ. ఇక్కడి ఇసుకకు డిమాండ్ ఉండటంతో రేట్లు కూడా పెంచేసింది. ఓపెన్ రీచుల్లో తక్కువ ధరకే ఇసుక లభిస్తుండటంతో.. తమకు గిరాకీలు తగ్గిపోయాయంటున్నారు బోట్స్‌మెన్.
ఇలా ఓపెన్ రీచుల్లో ఒక రేటు.. డిస్టిలేషన్ రీచుల్లో ఒక రేటుకు ఇసుకను విక్రయించడంతో తాము పూర్తిగా నష్టపోతున్నామంటున్నారు బోట్స్‌మెన్లు. తమ సమస్యను ప్రజాప్రతినిధులకు.. అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇసుక రేట్లు తగ్గించడంతో పాటు తమకు రావాల్సిన కమీషన్‌ను పెంచాలని కోరుతున్నారు.