Andhra Pradesh: కంగారు పెట్టిన వింత జంతువు.. ప్రమాదం లేదన్న అధికారులు
తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవలి కాలంలో వింత జంతువు కలకలం సృష్టించింది. పొలాల్లో దూడలను ఆ జంతువు చంపుతోందని భావించారు స్థానికులు. అయితే, అది ఆ జంతువు పని కాదని అధికారులు చెబుతున్నారు.
ఏపీ లో తూర్పుగోదావరి జిల్లాలో ఆలమూరు, కపిలేశ్వర పురం మండలాల్లో ఇటీవల కాలంలో లేగ దూడల్ని జంతువులు చంపి తినేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కలవరపడుతున్నారు. ఇదిలా ఉండగా నిన్న అక్కడ ఒక వింత జంతువూ ప్రత్యక్షం అయింది. దానిని గమనించిన స్థానికులు ఆ జంతువు వెంట పడటంతో అది దగ్గరలోని పాడుపడిన బావిలో దూకింది. అయితే, ఆ జంతువూ చూడటానికి చిన్నగా ఉండటంతో అది దూడల్ని చంపే అవకాశం ఉందా అని వారు అనుమానించారు. కానీ, అది ఎప్పుడూ చూడని జంతువూ కాకపోవడంతో ప్రజలు భయానికి గురయ్యారు. దీంతో ఆ గురించి అధికారులకు సమాచారం ఇచ్చారు. జంతువు
అధికారులు వింతజంతువును పరిశీలించారు. ఈ జంతువు పేరు నీటి కుక్కగా పశు సంవర్ధక శాఖ అధికారులు చెప్పారు. ఇది పెద్ద జంతువులను వేటాడదనీ, సాధారణంగా చేపలు, కప్పలు వంటి జంతువులను మాత్రమే ఇది వేటాడుతుందని స్పష్టం చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా గత నెలరోజుల సమయంలో పన్నెండు లేగదూడల్ని గుర్తు తెలియని జంతువులూ చంపి తినేసినట్టు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలన జరిపిన అధికారులు లేగదూడల్ని చంపి తిన్న జంతువు నక్క (గోల్డెన్ జాకాల్) గా గుర్తించినట్టు చెప్పారు. ఈ నక్కలు ఖమ్మం అటవీ ప్రాంతం నుంచి ఇటువైపుగా వచ్చాయని.. అవి లేగదూడల్ని చంపి తింటున్నాయనీ వారు స్పష్టం చేశారు. గతంలో కపిలేశ్వర పురంలో రైతులు ఒక నక్కను పట్టి చంపేశారని అధికారులు చెప్పారు. ఇప్పుడు కనిపించిన జంతువు నీటి కుక్క అనీ.. అది మనుషులకు.. దూడలకూ ఏమాత్రం హాని చేయదనే వారు చెప్పారు. అదీకాకుండా ఈ నీటి కుక్క మనుషుల్ని చూస్తే పారిపోతుందని తెలిపారు. ఎప్పుడూ దీనిని చూసిఉండకపోవడంతో దానిని చూసి వింత జీవిగా పొరబాటు పడ్డారని అధికారులు వివరించారు.