Andhra Pradesh: ముగిసిన పంచాయతీ ఎన్నికలు..ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే?

Andhra Pradesh: నాలుగు విడతల్లోనూ వైసీపీ మద్దతుదారులదే హవా సాగింది.

Update: 2021-02-22 03:39 GMT

పంచాయతీ ఎన్నికలు 

Andhra Pradesh: ఏపీలో పంచాయతీ పోరు ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా.. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నాలుగో దశ ఎన్నికల్లో 82.85 శాతం పోలింగ్ నమోదుకాగా.. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం.. అత్యల్పంగా నెల్లూరులో 76 శాతం నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా 4 దశల్లో జరిగిన ఎన్నికలు కలిపి.. మొత్తం 13వేల 87 పంచాయతీలు, లక్షా 30వేల 353 వార్డులకు పోలింగ్ ముగిసింది. వీటిలో 2వేల 197 పంచాయతీలు, 47వేల 459 వార్డులు ఏకగ్రీవం కాగా.. 10వేల 890 పంచాయతీలు, 82వేల 894 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇక.. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భారీగా ఓటెత్తారు. 2 కోట్ల 26 లక్షల మందికి పైగా ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 4 విడతలు కలిపి మొత్తంగా 81.78 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఇప్పటివరకు విడుదలైన ఫలితాలను పరిశీలిస్తే.. వైసీపీ విజయ పరంపర కొనసాగిస్తోంది. చివరి దశలోనూ అత్యధిక స్థానాలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకుంటున్నారు. తుది విడతలో 13 జిల్లాల్లోని 161 మండలాల్లో 3వేల 299 సర్పంచ్‌, 33వేల 435 వార్డులకు పోలింగ్‌ జరగనుండగా.. ఇప్పటికే 553 సర్పంచ్‌, 10వేల 921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 2వేల 744 సర్పంచ్‌ స్థానాలకు 7వేల 475 అభ్యర్థులు పోటీ పడ్డారు. 22వేల 422 వార్డులకు 49వేల 83 మంది బరిలో నిలిచారు.

చివరి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ వైసీపీ మద్దతుదారులు విజయ ఢంకా మోగిస్తున్నారు. దీంతో వైసీపీ కార్యాలయాల్లో సంబరాలు.. అంబరాన్నంటుతున్నాయి. మరోవైపు పలుచోట్ల టీడీపీ బలపరిచిన అబ్యర్ధులు సత్తా చాటారు. ఇంకోపక్క.. రాజోలు నియోజకవర్గంలో దాదాపు 20కి పైగా పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు గెలిచినట్టు తెలుస్తోంది.



Tags:    

Similar News