AP MPP Election 2021: ఏపీ వ్యాప్తంగా నేడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక

AP MPP Election 2021: *తొలుత ఎంపీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం *కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక

Update: 2021-09-24 03:47 GMT

ఏపీ వ్యాప్తంగా నేడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక

AP MPP Election 2021: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా నేడు ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీపీతో పాటు ప్రతి మండలానికి ఒకరు చొప్పున కో ఆప్టెడ్ సభ్యునితో పాటు మండల ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 10గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం 3గంటలకు ముగియనుంది. మండల పరిధిలో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇక కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీల్లో సగం మంది హాజరైతేనే ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

ఈ నెల 19న ఫలితాలు వెల్లడైన సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఎంపీపీ.. రేపు జెడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం విధి విధానాలను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10వేల 47 ఎంపీటీసీ స్థానాల్లోని 9వేల 583 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారితో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ఆ సమావేశంలోనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత కో ఆప్టెడ్‌ సభ్యుని ఎన్నిక నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు మరొకసారి సమావేశం నిర్వహించి, తొలుత ఎంపీపీ పదవికి ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు.

Tags:    

Similar News