ఏపీలో ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్.. అలా చేస్తే గుర్తింపు రద్దు

ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ ప్రభావం తగ్గగానే స్కూల్స్ తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Update: 2020-06-25 03:06 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ ప్రభావం తగ్గగానే స్కూల్స్ తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు కూడా విద్యార్ధులపై దృష్టిసారించాయి. ఈ ఏడాది కూడా తమ టీచర్లను విద్యార్దుల ఇళ్లకు పంపి అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అడ్మిషన్ల కోసం టీచర్లను విద్యార్ధుల ఇళ్లకు పంపడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు తమ సిబ్బందికిచ్చే వేతనాన్ని అడ్మిషన్లతో ముడిపెట్టి వేధించడం సరైంది కాదని తెలిపింది.

ఏపీ పాఠశాల విద్య నియంత్రణ , పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ఆర్ కాంతారావు కమిషన్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో వైస్ చైర్ పర్సన్ విజయ శారద రెడ్డి, కార్యదర్శి సాంబశివా రెడ్డి, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి నివేదించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో టీచర్లను ఇళ్లకు పంపడం లాంటి చర్యలకు పాల్పడితే సంబంధిత పాఠశాలలు, కళాశాలల గుర్తింపు రద్దు చేసేలా కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ విద్యాసంస్థలోనైనా ఇలాంటివి మళ్లీ జరిగితే apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ ద్వారా తమకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రైవేటు పాఠశాలలు టీసీలు మంజూరు చేయడం లేదని, విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరాదని కమిషన్ సూచించింది.ప్రైవేటు పాఠశాలల గుర్తింపు, రెన్యువల్ కు సంబంధించిన జిఓ ఎంఎస్ నెంబర్ 1 ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సి ఉందని, ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సీబీఎస్సీ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి వారు సూచించారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆన్లైన్ సింగిల్ విండో సిస్టంను తీసుకురావాలని సూచించారు.దీని ద్వారా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్ లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు డిప్యుటేషన్ , ఫారిన్ సర్వీస్ మీద పనిచేస్తున్నారని వీరందరిని తిరిగి పాఠశాలకు తీసుకురావాల్సిన అవసరం ఉందని కమిషన్ నిర్ణయించింది. ప్రస్తుతం టీవిలో ప్రభుత్వం ప్రసారం చేస్తున్న పాఠాలలో.. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చేర్చాలని విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంకు అలవాటు పడతారని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.


Tags:    

Similar News