APSRTC Mobile Rythu Bazar: బస్సులే బజార్లు.. ఆర్టీసీని వినియోగిస్తున్న ప్రభుత్వం
APSRTC Mobile Rythu Bazar: కోరోనా వైరస్ విలయంలో ప్రధానంగా దెబ్బతింది ఆర్టీసీ అని చెప్పాలి.
APSRTC Mobile Rythu Bazar: కోరోనా వైరస్ విలయంలో ప్రధానంగా దెబ్బతింది ఆర్టీసీ అని చెప్పాలి. ఎందుకంటే రవాణా వ్యవస్థ దాదాపుగా నిలిచిపోవడంతో ఈ దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ కొన్ని చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఆదేశాను సారం వీటిలో కొన్ని బస్సులను ప్రత్యేకంగా టెస్టింగ్ ల్యాబ్ లుగా, మరికొన్నింటిని రైతు బజార్లుగా ఇంటింట తిరిగి కూరగాయలు అమ్మకం చేసేలా ఏర్పాట్లు చేస్తోంది.
కోవిడ్-19 కట్టడి కోసం ఏపీ సర్కార్ పకడ్బందీ చర్యలు చేపడుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు కరోనా వైరస్ సంక్షోభం వల్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యారు. అన్ లాక్ సడలింపుల తర్వాత కొన్ని బస్సులు రోడ్డెక్కినా, మొత్తం సర్వీసుల ప్రారంభం కాకపోవడంతో ఇంకా భారీ సంఖ్యలో బస్సులు గ్యారేజీలకే పరిమితమయ్యాయి. ఈ సమయంలో ఖాళీగా ఉన్న బస్సులను ప్రజల ప్రయోజనార్థం ఉపయోగించాలని ఏపీ సర్కార్ ముందుకువెళ్తుంది. అందులో భాగంగా సంచార వాహనాలలో కోవిడ్-19 టెస్టులు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇంద్ర బస్సులను ఈ సేవలకు వినియోగిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు శాంపిల్స్ సేకరించడానికి వీలుగా ఏసీ బస్సుల్లోని సీట్లను తొలగించి తక్కువ ఖర్చుతో వీటిని సంజీవని వాహనాలుగా మార్చారు..
ఇక ప్రస్తుత సమయంలో ప్రజల బయటకు వెళ్లకుండా వీలు కల్పించేలా ఇళ్ల వద్దకే కూరగాయలు పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు ఆర్టీసీ బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చేశారు. బస్సు లోపల అన్ని సౌకర్యాలతో కూరగాయలు నిల్వ ఉంచడానికి, అమ్మకాలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. త్వరలోనే ఈ మొబైల్ రైతు బజార్లు ప్రజలు ఇళ్ల వద్దకు వచ్చి అమ్మకాలు చేయనున్నాయి.