Coronavirus: కరోనాకు కళ్లెం.. ఏపీ ప్రభుత్వం చర్యలు
Coronavirus | కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయనే చెప్పాలి.
Coronavirus | కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయనే చెప్పాలి. అయితే అనుకోకుండా కొన్ని కారణాల వల్ల మధ్యలో కేసులు పెరిగేందుకు కారణమైనా, వాటిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రధానంగా కోవిద్ సోకిన వారికి పరీక్షలు చేయడంలో దేశంలోనే ప్రప్రధమ రాష్ట్రంగా ఇప్పటికీ ముందు వరుసలో ఉంది. ఇదేకాదు.. వారికి చికిత్సలు చేసే విషయంలో్ సైతం ఆరోగ్య శ్రీని అనుసంధానం చేసి, పేదరోగులకు బాసటగా నిలిచింది.
ఎయిర్‌పోర్టుల్లోనే ఆగాల్సింది... స్క్రీనింగ్ లోపాలతో దేశంలోకి చొరబడేసింది. పారాసెటమాల్ మాత్రలు వాడి కొందరు స్క్రీనింగ్ కళ్లుగప్పి దేశంలోకి వైరస్‌ను తెచ్చేశారు. అప్పుడు మొదలైంది రాష్ట్రంలో 'టీటీటీ'.. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్. వలంటీర్ల వ్యవస్థను వినియోగించుంటూ కోవిడ్ కట్టడికి ఆరంభంలోనే చర్యలు ప్రారంభమయ్యాయి.
ఇదంతా కొలిక్కి వస్తున్న దశలో ఢిల్లీ వెళ్లి వచ్చిన మర్కజ్ యాత్రికులకు కొందరు విదేశీయుల ద్వారా వైరస్ సోకడం.. దేశ రాజధాని నుంచి పలు రాష్ట్రాలకు కోవిడ్ వ్యాప్తి మొదలైంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ టెస్టింగ్ సామర్థ్యం, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. దాపరికం లేకుండా వివరాలను వెల్లడించింది. విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న వారిని అక్కున చేర్చుకుంటూనే వైరస్ నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేయడం సత్ఫలితాలనిస్తోంది. మంగళవారం ఉదయం వరకు ఏపీలో 47,31,866 టెస్టులు చేయగా ప్రతి పది లక్షల జనాభాకు 88,612 పరీక్షలతో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. కరోనా మొదలైన తొలి రోజుల్లోనే దీనికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకుంటూ జీవనాన్ని సాగిద్దామని, వ్యాక్సిన్ వచ్చే వరకు సహజీవనం చేయక తప్పని పరిస్థితి నెలకొందన్న సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో ఇప్పుడు అంతా ఏకీభవిస్తున్నారు.
ఒకే ఒక్కటి నుంచి...
► రాష్ట్రంలో కరోనా తొలి కేసు వెలుగులోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతుండగా అప్పుడు కనీసం వైరస్‌ను నిర్థారించే సామర్థ్యం కూడా మనకు లేదు. తిరుపతిలో నమూనాల సేకరణకు మాత్రమే వీలుంది. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు 14 వైరాలజీ ల్యాబొరేటరీలు, 240కి పైగా ట్రూనాట్ మెషీన్లు, ఐదు ప్రైవేటు ల్యాబ్‌లతో అనూహ్యంగా సామర్థ్యాన్ని పెంచగలిగారు.
► ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతను పరిష్కరిస్తూ ఒక్క నిర్ణయంతో 12 వేల మంది సిబ్బంది నియామకాలకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలిచ్చారు.రాష్ట్రంలో సగటున నేడు రోజుకు 70 వేల టెస్టులు నిర్వహిస్తుండటం గమనార్హం.
అంతా పారదర్శకంగా..
► కరోనా కలకలం మొదలైన తొలి రోజుల్లోనే 'పారదర్శకంగా పనిచేద్దాం.ప్రజలకు సేవలందిద్దాం' అని సీఎం జగన్ సూచించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం దీన్ని తు.చ. తప్పకుండా పాటిస్తోంది. ఐసీఎంఆర్ పోర్టర్‌లో వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తున్నారు.
ఒక్క ఫోన్‌కాల్‌తో...
► వైద్యసేవల కోసం ఎలాంటి సిఫారసులతో పనిలేకుండా 104 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే చాలు పడకల నుంచి వైద్యం వరకు అన్నీ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
► 14410, 108లతో పాటు పలు యాప్‌లు అందుబాటులోకి తెచ్చింది. రోగులకు సేవల్లో జాప్యం లేకుండా చెంతనే కాలింగ్ బెల్స్, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటయ్యాయి. ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ ఐవీఆర్‌ఎస్ ద్వారా రోగులకే నేరుగా ఫోన్ చేసి సదుపాయాల గురించి వాకబు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కావడం గమనార్హం.
ఆరోగ్యశ్రీలో చేర్చిన తొలి రాష్ట్రం..
► దేశంలో ఆంధ్రప్రదేశ్ మినహా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇప్పటిదాకా కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలోకి చేర్చలేదు. కార్డు లేనివారికి సైతం ఉచితంగా వైద్యం అందేలా ఆరోగ్యశ్రీలో చేర్చారు. కరోనా చికిత్సకు రూ.18 వేల నుంచి రూ.2.60 లక్షల వరకూ ధరలు నిర్ణయించి ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఏ ఆస్పత్రిలోనైనా ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించిన ఏకైక రాష్ట్రం ఏపీ.
► రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 5.83 లక్షలు దాటింది. ఎక్కువ టెస్టులు చేయడం ద్వారా వైరస్ కట్టడి దిశగా ప్రభుత్వం రూపొందించిన వ్యూహం ఫలించింది. తాజా గణాంకాల ప్రకారం ఏపీలో మరణాల రేటు 0.86 % మాత్రంగానే ఉంది. చివరి నిమిషంలో ఆస్పత్రికి రావడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని మరణాలు నమోదు కాగా వారిని కాపాడేందుకు అధికార యంత్రాంగం, వైద్య సిబ్బంది చివరివరకు శ్రమించారు.