సవరించిన ఇసుక పాలసీ నిబంధనలతో జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం!
* ఎక్కడనుంచైనా ఇసుక తెచ్చుకోవచ్చు * ఇక అంతటా ఆఫ్‌లైన్ విధానమే * ప్రభుత్వం నిర్ణయించిన ధరే అమలు * అధిక రేట్లకు అమ్మకుండా నియంత్రణ * ఎడ్ల బండ్లలో తీసుకెళితే ఉచితం * సవరించిన ఇసుక పాలసీ నిబంధనలతో జీవో జారీ చేసిన ప్రభుత్వం
ప్రజలు తమకు నచ్చిన రీచ్‌కు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి, అక్కడికక్కడే డబ్బు చెల్లించి, కావాల్సిన చోటుకు ఇసుక తీసుకెళ్లవచ్చు. నెట్ పని చేయడం లేదనే తిప్పలు ఉండవు. బుక్ చేసుకోవడం కోసం యాప్ పని చేయడం లేదంటూ నెట్ సెంటర్ల వద్దకు పరుగులు తీయాల్సిన శ్రమ ఏమాత్రం అక్కర లేదు. ఆన్‌లైన్ మోసాలకు ఆస్కారమే ఉండదు. సిఫార్సుల ఊసుండదు. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదంతో ప్రభుత్వం ఇసుక పాలసీ 2019 ని మరింత మెరుగు పరిచింది. ఇందుకు సంబంధించి భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది జీఓ జారీ చేశారు.
సవరించిన ఇసుక పాలసీలో ముఖ్యాంశాలు
►ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయం బాధ్యతలను నామినేషన్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుంది. నిర్ణయించిన మొత్తాన్ని ఆయా సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాలి. సీనరేజి, ఇతర పన్నులు దీనికి అదనం.
►కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ముందుకు రాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస టెండరు ధర ఖరారు చేసి అనుభవం, సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక పరిపుష్టి ఉన్న సంస్థలను టెక్నికల్, కమర్షియల్ బిడ్ల ద్వారా ఎంపిక చేస్తుంది.
మొత్తం రీచ్‌లు మూడు ప్యాకేజీలుగా వర్గీకరణ
►శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలను మొదటి ప్యాకేజీ కింద.. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు రెండవప్యాకేజీగా.. నెల్లూరు, అనంతపురం, కృష్ణా, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలను మూడో ప్యాకేజి కింద చేరుస్తారు.
►1–3 ఆర్డర్ స్ట్రీమ్స్‌తోపాటు ఆపై స్థాయి స్ట్రీమ్స్ (నదులు, వాగులు)ను నిర్వహణ సంస్థ(ల)కే అప్పగించి ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయాలు సాగించేందుకు వీలుగా ఏపీ వాల్టా, ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్‌ను సవరిస్తారు.
► ఆ సంస్థలు ప్రత్యేక నోటిఫైడ్ రీచ్‌లలో డీసిల్టేషన్ ద్వారా ఇసుక సేకరణకు బోట్స్‌మెన్ సొసైటీలకు ఉపాధి కల్పించే విషయాన్ని పరిశీలించవచ్చు. నాణ్యతను దృష్టిలో పెట్టుకుని, పట్టా భూముల్లో తవ్వకాలు నిలిపివేస్తారు. ఇసుక లభ్యత పెంచడానికి ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో డ్రెడ్జింగ్ చేస్తారు. భూగర్భ గనులు, జల వనరుల శాఖల సహకారంతో దీన్ని చేపడతారు. ఎవరికి ఎంత ఇసుక కావాలన్నా బుక్ చేసుకుని తీసుకెళ్లవచ్చు. దీనిపై పరిమితులు ఉండవు. స్టాక్ యార్డుల్లో, రాష్ట్రంలోని నిర్ధారిత నగరాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక సరఫరా జరుగుతుంది.
ఆన్‌లైన్ విధానం ఉండదు
►ఆఫ్‌లైన్ విధానంలోనే డబ్బు చెల్లించి ఇసుకను తీసుకెళ్లొచ్చు. ఆన్‌లైన్ విధానం ఉండదు. స్టాక్ యార్డులు/ రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లడానికి వినియోగదారులే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి. ఆయా సంస్థలు ప్రతి స్టాక్ యార్డు/ రీచ్‌లలో 20 వాహనాలను అందుబాటులో ఉంచాలి. ఈ సంస్ధలు నిర్ణీత పూచీకత్తు మొత్తం (పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ – పీఎస్టీ ) చెల్లించాలి
పేదల గృహ నిర్మాణాలకు ఉచితమే
ప్రజలు సొంత అవసరాలకు ఇసుకను ఎడ్లబండ్లపై ఉచితంగా తీసుకెళ్లవచ్చు. రీచ్‌లకు సమీపంలోని గ్రామాల వారికి, బలహీన వర్గాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ పనులకు, సహాయ పునరావాస కార్యక్రమం కింద నిర్మించే ఇళ్లకు కూపన్ల జారీ ద్వారా ఇసుకను ఉచితంగా ఇస్తారు. అన్ని దశల్లో పారదర్శకత ఉంటుంది. అక్రమ తవ్వకాలు, నిల్వ, రవాణాను నియంత్రించేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు దాడులు చేసి, కేసులు నమోదు చేసే అధికారముంటుంది. మెరుగైన ఇసుక విధానం అమలుకు భూగర్భ గనుల శాఖ సంచాలకులు, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండీ అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.
శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూగర్భ, గనుల శాఖ మంత్రి
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ పాలసీలో సవరణలు తీసుకొచ్చినట్లు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నాణ్యమైన ఇసుకను ప్రజలకు అందించడం, వారే స్వయంగా ఇసుక నాణ్యతను పరిశీలించి తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్న లక్ష్యంగా పాలసీలో సవరణలు చేసినట్లు ఆయన తెలిపారు.