Sachivalayam Exams 2020: కరోనా లక్షణాలున్నా ఓకే.. సచివాలయ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Sachivalayam Exams 2020 | ఏపీలో ఈ నెలలో జరగనున్న సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది.

Update: 2020-09-17 03:11 GMT

Sachivalayam Exams 2020 | ఏపీలో ఈ నెలలో జరగనున్న సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది. ఇంతవరకు ఏ పరీక్షకు కరోనా లక్షణాలుంటే పరీక్ష రాయకుండా నిషేదం ఉండేది. దానికి భిన్నంగా ఈ లక్షణాలుంటే పరీక్షలు రాసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రులు ప్రకటించారు.

కరోనా లక్షణాలు ఉన్నవారు సైతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు రాసేలా ప్రతీ కేంద్రంలో ప్రత్యేకంగా ఐసోలేషన్‌ పరీక్ష రూమ్‌ ఏర్పాటు చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఐసోలేషన్‌ రూమ్‌లో ఇన్విజిలేషన్‌ బాధ్యతలు నిర్వహించే వారికి పీపీఈ కిట్లతోపాటు ఆ గదిలో వీడియో రికార్డింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న రాత పరీక్షల ఏర్పాట్లపై మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే..

► పరీక్ష కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స సదుపాయాలు, కోవిడ్‌ చికిత్సకు అవసరమైన మందులు, పల్స్‌ ఆక్సీమీటర్లతో కూడిన సామగ్రి అందుబాటులో ఉంచుతున్నాం.

► పరీక్ష కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ స్కానర్‌ ఏర్పాటు. అభ్యర్థులు పరీక్షా సమయానికి కనీసం గంట ముందే వారికి కేటాయించిన కేంద్రానికి చేరుకుంటే మంచిది.

► నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించే పరిస్థితి ఉండదు.

► గత ఏడాది 1,26,728 ఉద్యోగాలకు పోటీ పరీక్షలను నిర్వహించగా, 1,10,520 ఉద్యోగాల భర్తీ పూర్తయింది. మిగిలిన 16,208 పోస్టుల భర్తీకి ఇప్పడు రాత పరీక్షలు నిర్వహిస్తున్నాం.

► ఈ పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు చేసుకోగా, 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నాం.

దళారులను నమ్మొద్దు: మంత్రి బొత్స

► పరీక్షల్ని అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. అర్హత గల ప్రతిభావంతులకే ఉద్యోగాలు వస్తాయి. ఎవరూ మధ్యవర్తులు, దళారులు చెప్పే మాటల్ని నమ్మొద్దు.

► ఈ విషయమై ఎప్పటికప్పుడు కలెక్టర్లు, ఎస్పీలను వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమన్వయం చేస్తున్నాం.

► కొన్ని పోస్టులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు లేకపోయినా కొందరు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వారికి హాల్‌టిక్కెట్లు రావు.

Tags:    

Similar News