AP Govt on Corruption: లంచం తీసుకుంటే ఉద్యోగం గోవిందా.. జైలు తప్పదు... ఏపీ ప్రభుత్వం నిర్ణయం
AP Govt on Corruption: ఏ కార్యాలయంలో చూసినా లంచం లేకుండా పనిజరగడం లేదు..
AP Govt on Corruption: ఏ కార్యాలయంలో చూసినా లంచం లేకుండా పనిజరగడం లేదు... పలానా శాఖ అనేది లేకుండా అన్నింటిలోనూ ఈ వ్యవస్థ కొనసాగుతోంది. అయితే దీనిని నిర్మూలించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో మాదిరి కాకుండా లంచం తీసుకుంటే పట్టువడ్డ వారిపై విధించే విధి విధాలనాలను మరింత కఠిన తరం చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సంబంధిత అధికారులతో ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి సమీక్ష జరిపారు.
లంచం తీసుకొంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇక ఉద్యోగం పోయినట్లే. అంతేకాదు.. సాగతీతకు అవకాశం లేకుండా తక్కువ కాలంలోనే జైలుకు వెళ్లక తప్పదు! ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో అవినీతి నిరోధం.. ప్రభుత్వ చర్యల'పై సమీక్ష జరిగింది. రాష్ట్రంలో పలుశాఖల్లో జరుగుతోన్న అవినీతి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అహ్మదాబాద్ ఐఐఎం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రూపొందించిన అధ్యయన నివేదికను సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అవినీతి కేసులు ఏళ్ల తరబడి సాగుతుండటం అవినీతి కట్టడికి ఒక పెద్ద ఆటంకంగా ఉందన్నారు. రెడ్ హ్యాండెడ్‌గా లంచం తీసుకొంటూ పట్టుబడిన వారిపై సకాలంలో చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులకు సాక్ష్యాలు సమర్పిస్తే శిక్షల శాతం పెరుగుతుందన్నారు. దిశ తరహాలో అతితక్కువ కాలంలో శిక్షలు పడేలా అవసరమైతే చట్టాన్ని సవరించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1902 నంబర్‌కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలను ఏసీబీకి చెందిన 14400కు బదలాయించాలని సమావేశంలో నిర్ణయించారు. సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏసీబీ డీజీ పీఎ్‌సఆర్ ఆంజనేయులు, ఐఐఎం ప్రతినిధులు పాల్గొన్నారు.
సెప్టెంబరు 3న కేబినెట్ భేటీ
సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబరు 3న జరగనుంది. కేంద్రం కరోనా లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో కూడిన కొత్త మార్గదర్శకాలను ఇచ్చిన నేపథ్యంలో వాటిపై కేబినెట్ చర్చించనుంది. సెప్టెంబరు 5న టీచర్స్‌డే నాడు పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్న నేపథ్యంలో.. ఇతర విద్యా సంస్థలను ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపైనా సీఎం జగన్ చర్చించనున్నారు.
కడప ఉక్కుకు త్వరలో ఆర్‌ఎఫ్‌పీ
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ముందుకొచ్చే కంపెనీల నుంచి తగిన ప్రతిపాదనలు పిలిచేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 4 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ఒకదాన్ని ఎంపికచేసేందుకు త్వరలోనే ఆర్‌ఎఫ్‌పీ పిలవనున్నారు.