YSR Bheema Scheme: వేగంగా వైఎస్సార్ భీమా.. ఏపీ ప్రభుత్వం చర్యలు
YSR Bheema Scheme | పేద కుటుంబ యాజమానులు మరణించినప్పుడు ఒక్కసారే పెద్ద దిక్కును కోల్పోయే పరిస్థితి వస్తుంది.
YSR Bheema Scheme | పేద కుటుంబ యాజమానులు మరణించినప్పుడు ఒక్కసారే పెద్ద దిక్కును కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో అలాంటి కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం వారికి భీమా ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ప్రమాదాల బారిన పడి మరణించినా, సాధారణంగా చనిపోయినా ఆ కుటుంబానికి కొంతమేర ఆసరా కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పటికే వాలంటీర్లు వారి పేర్లు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అర్హులైన పేదల పేర్లు నమోదు చేసుకుని, వారికి ఈ పథకంలో భాగస్వామ్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
వైఎస్సార్ బీమా పథకం కింద లబ్ధి పొందే కుటుంబాలను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే కార్యక్రమం చేపట్టింది. వార్డు, గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు. నిరుపేద కుటుంబాల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితులు, బియ్యం కార్డు ఉన్నదా? లేకపోతే అందుకు గల కారణాలను నమోదు చేసుకుంటున్నారు. ఈ వివరాలను గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు నమోదు చేసుకుని అర్హులను ఎంపిక చేస్తున్నారు.
అల్పాదాయ వర్గాలకు బీమా ధీమా
► నిరుపేదలు, అల్పాదాయ వర్గాలకు బీమా ధీమా కల్పించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది.
► గతంలోనూ ఈ బీమాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేశాయి. ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఉపసంహరించుకోవడంతో అమలు బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భుజానికి ఎత్తుకుంది.
► అసంఘటిత రంగంలోని కార్మికులు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
► అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.50 కోట్ల కుటుంబాలు బియ్యం కార్డుల్ని కలిగి ఉన్నాయి. వీరందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
► అసంఘటిత రంగంలోని కార్మికులు, అల్పాదాయ వర్గాల వారు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం జీవనాధారాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి.
► అలాంటి కుటుంబాలకు బీమా పరిహారం అందితే వారికి జీవనం కొనసాగించే వీలుంటుంది. ఈ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే ఆ కుటుంబాల తరఫున ప్రీమియం మొత్తాలను చెల్లిస్తుంది.
ప్రయోజనాలివీ..
► 18 నుంచి 50 సంవత్సరాల్లోపు వయసు కలిగిన కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యం పొందినా రూ.5 లక్షల బీమా మొత్తం ఆ కుటుంబానికి అందుతుంది.
► సహజ మరణమైతే రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. 51 నుంచి 70 ఏళ్లలోపు వారు ప్రమాదవశాత్తు మరణించినా.. శాశ్వత వైకల్యం పొందినా రూ.3 లక్షల పరిహారం అందుతుంది.