ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్
AP educational minister adimulapu suresh tests corona positive : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.
AP educational minister adimulapu suresh tests corona positive : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. అదే విధంగా మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొంతమంది కోలుకోగా, ఇంకొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వాట్సాప్ వీడియో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.
గడిచిన 24 గంటల్లో 8,601 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 54,463 శాంపిల్స్‌ని పరీక్షించగా 8,601 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,741 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో 10 మంది, ప్రకాశంలో 10 మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, విశాఖపట్టణంలో ఏడుగురు, అనంతపూర్‌లో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3,58,817. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,368. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,65,933కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 89,516 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 54,463 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 32,92,501 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.