AP CM YS Jagan: వరద బాధితులకు అన్ని విధాలా సాయం.. అదనంగా రేషన్ సరుకులు పంపిణీ
AP CM YS Jagan: వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు.
AP CM YS Jagan: వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఇచ్చేందుకు నిర్ణయించిన సాయంతో పాటు కరోనా నేపథ్యంలో ఇచ్చే ఉచిత సరుకులకు అదనంగా వరద బాధితులకు మరో విడతగా ఉచితంగా సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. దీనికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. దీంతో పాటు వీలైనంత తొందర్లో పంట నష్టం వివరాలను అంచనా వేసి, అందజేయాలని సూచించారు.
గోదావరి ముంపు బాధిత కుటుంబాలకు సాధారణంగా (రెగ్యులర్) ఇచ్చే రేషన్‌కు అదనంగా నిత్యావసరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌కు ఇది అదనంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆ సరుకులను సెప్టెంబర్ 7వ తేదీకల్లా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. 'స్పందన'లో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరద సహాయక చర్యలపై సమీక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
► సెప్టెంబర్ 7వ తేదీలోగా గోదావరి ముంపు బాధితుల్లో ఒక్కో కుటుంబానికి రూ.2 వేల చొప్పున అదనపు సహాయం ఇచ్చేలా ప్రణాళిక వేసుకోండి. ఇంతే కాకుండా 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళా దుంపలు రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌కు అదనంగా ఇవ్వాలి.
► వరదల కారణంగా దెబ్బ తిన్న చోట్ల వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున మందులు అందుబాటులో ఉంచుకోవాలి.
► వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి.. రోగాలు రాకుండా మనం పోరాటం చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా వెంటనే వైద్య శిబిరాలను ప్రారంభించాలి. మండల స్థాయిలో నిత్యావసర సరుకులను పూర్తి స్థాయిలో నిల్వ చేసుకోవాలి. పారిశుధ్య కార్యక్రమాలు, తాగు నీటి క్లోరినేషన్ కోసం చర్యలు తీసుకోవాలి.
► దేవుడి దయతో గోదావరిలో వరదలు తగ్గుముఖం పట్టాయి. గోదావరిలో 10 లక్షల క్కూసెక్కుల కంటే తక్కువ వరద ఉందన్న సమాచారం వస్తోంది. కృష్ణా నదిలో కూడా వరదలు తగ్గుముఖం పడుతున్నాయి.
► శ్రీశైలంలో గేట్లు కూడా మూసివేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
► సెప్టెంబర్ 7లోగా పంట నష్టంపై అంచనాలు రూపొందించి, కలెక్టర్లు ఆ మేరకు బిల్లులు సమర్పించాలి. దీనిపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. కృష్ణా జిల్లా సహా మిగిలిన చోట్ల ఎక్కడ పంటలు దెబ్బ తింటే.. అక్కడ వెంటనే చర్యలు చేపట్టాలి. వరద వేళ బాగా పని చేసిన ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు అభినందనలు.