జగన్ గ్యారేజ్....ఇచ్చట అన్ని రిప్లేర్లు చెయ్యబడును. పార్టీలో కొన్ని మరమ్మత్తులకు నడుంకట్టారు సీఎం వైఎస్ జగన్. మోతాదుకు మించి మోతెక్కుతున్న హారన్లకు ముకుతాడు వేస్తున్నారు. పొగలు కక్కుతూ చుట్టుపక్కల కాలుష్యం వెదలజల్లుతున్న సైలెన్సర్లను సెట్‌రైట్ చేస్తున్నారు. బ్రేకుల్లేకుండా ఎడాపెడా డ్రైవ్ చేస్తున్న లీడర్లకు, డిస్క్ బ్రేక్ తడాఖా చూపిస్తున్నారు. ఏకంగా లైసెన్స్ రద్దు చేస్తాననీ రూల్ బుక్‌తో, సీరియస్ లుక్కిస్తున్నారు. ఇంతకీ జగన్ గ్యారేజీకి, రిపేరుకొచ్చిన బండ్లేవి? జగన్ స్టైల్ ఆఫ్ మరమ్మత్తులేంటి?
వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రభుత్వ వ్యవహారాల్లో తలమునకలవుతూ, పార్టీపై దృష్టిపెట్టలేకపోయిన జగన్, ఈమధ్య పార్టీ ఇంటర్నల్ ఇష్యూలు అదేపనిగా రచ్చరచ్చ అవుతుండటంపై సీరియస్‌గా రియాక్ట్ అవడం ప్రారంభించారట. ఏమాత్రం పార్టీ లైన్‌ను దాటినా, సహించేదిలేదని హెచ్చరించారట. పార్టీకి సంబంధించిన ఎలాంటి విషయాలైనా, కేవలం పార్టీ వేదికలపైనే మాట్లాడాలని, బహిరంగ ప్రదేశాల్లో ఏమాత్రం మాట తూలినా, కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారట జగన్. దీంతో మొన్నటి వరకు అదేపనిగా నోటికి పని చెప్పిన చాలామంది వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈమధ్య సెట్‌రైట్ అవుతున్నారట. తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవు, కలిసిపోయాం, ఇష్యూలన్నీ టీ కప్పులో తుపాన్ అంటూ సర్దిజెప్పే ప్రయత్నం చేస్తున్నారట లీడర్లు. ఇందుకు తాజా నిదర్శనం, మొన్న మాటకు మాట అంటూ, ఉరుమురిమి చూసుకున్న ఎంపీ పిల్లి సుభాష్, ఎమ్మెల్యే ద్వారంపూడి, లేటెస్ట్‌గా ఒకే చోట చేరడం, నవ్వుతూ పలకరించుకోవడం.
కాకినాడ డీఆర్సీ సమావేశం వేదికగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య వాగ్వాదం వాడివేడిగా జరిగింది. టిడ్కో ఇళ్ళ కేటాయింపుల్లో లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించడం, మెడలైన్ వంతెనపై అభ్యంతరంతో ఒక్కసారిగా చెలరేగిపోయారు ద్వారంపూడి. మాటకు అంటూ మంటలు రేపారు. వైసీపీలో భగ్గుమన్న విభేదాలంటూ పతాకశీర్షికలు రావడం, రాష్ట్రమంతా రచ్చ కావడంతో, ఏకంగా సీఎం జగన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇద్దర్నీ అమరావతికి పిలిపించుకున్నారట. ఇలా ఒకరిపై మరొకరి ఆరోపణలతో పార్టీ, ప్రభుత్వం పరువు గంగలో కలుపుతున్నారని కోప్పడ్డారట జగన్. అత్యధిక ఎమ్మెల్యే సీట్లు వచ్చిన తూర్పు గోదావరిలో కీలకమైన మీలాంటి నేతల మధ్యే, పరస్పర దూషణలు, భూషణలేంటని క్లాస్ తీసుకున్నారట ముఖ్యమంత్రి. మరోసారి రిపీట్ అయితే, చూస్తూ ఊరుకోనని అన్నారట. దీంతో ఒక్కసారిగా కామ్ అయ్యారట పిల్లి సుభాష్, ద్వారంపూడి. తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని నిరూపించుకోవడానికి, మళ్లీ సమావేశమయ్యారు. ఎంపీ పిల్లి సుభాష్‌ను, తన ఇంటికి పిలిపించుకుని సాదరంగా ఆహ్వానించారట ద్వారంపూడి. వీరితో పాటు ఎంపీ గీత కూడా, ద్వారంపూడి ఇంటికి వచ్చారు. ముగ్గురూ కూర్చుని, నవ్వుతూ మాట్లాడుకుంటూ, కెమెరాలకు ఫోజులిచ్చారు. తమ మధ్య గొడవలు టీ కప్పులో తుపాన్ అంటూ చెప్పుకొచ్చారు. సీఎం జగనే సీన్‌లోకి ఎంటర్‌కావడంతో, నేతల మధ్య అనైక్యత హాంఫట్ అంటూ మాయమైందట.
మొన్న విశాఖ డీఆర్సీ మీటింగ్‌లోనూ ఇలాంటి రచ్చే జరిగింది. విశాఖలో భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి, కొందరు నేతలను ఉద్దేశించి ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, కలకలం రేపాయి. అవినీతిపరులు అంటూ పలుమార్లు ప్రస్తావించడంతో, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఫైర్ అయ్యారట. ఎవరి మీదయితే ఆరోపణలు వున్నాయో, వారిని ఉద్దేశించే మాట్లాడాలని, అందర్నీ కలగలిపి అనడం సరైందికాదన్నారట. దీంతో విజయసాయి సైతం ఆగ్రహంతో రగిలిపోయారట. ఇరువురి నడుమ చాలాసేపు వాడివేడిగా వాగ్వివాదం సాగిందట. ఆర్గ్యూమెంట్ జరుగుతుండగానే, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు రచ్చను మరింత పెంచాయి. పరిపాలనా రాజధాని కాబోతున్న వైూజాగ్‌లో, స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య అవినీతి ఆరోపణల రగడ అంటూ స్టేట్ మొత్తం చర్చనీయాంశమైంది. వీరి గొడవపై సీఎం జగన్, అంతే స్పీడ్‌గా రియాక్ట్ అయ్యారట. వెంటనే వారిని అమరావతికి పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారు. బహిరంగ వేదికలపై పార్టీ, సర్కారు ప్రతిష్ట దిగజార్చడమేంటని అన్నారట. ఇంకోసారి ఇలా జరిగితే, ఊరుకునేదిలేదని హెచ్చరికలు చేశారట. దీంతో వెంటనే దారికొచ్చిన సదరు నేతలు, మరోసారి ఇలాంటి గొడవలు రిపీట్ కావని హామి ఇచ్చారట. అక్కడితో వైజాగ్ డీఆర్సీ రచ్చకు ఫుల్‌స్టాప్ పడిందంటున్నారు వైసీపీ నేతలు.
గతంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మధ్య కూడా, ఇలాగే రోజుకో యుద్దం సాగిన టైంలో, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చిందట. ఇద్దర్నీ పిలిపించుకుని, చాలా కోప్పడ్డారట జగన్. ఇసుక, పేకాట, కేసులు, ఫోన్ రికార్డింగ్‌లు అంటూ, పార్టీ పరువు ఎందుకు బజారుకీడుస్తారని తలంటారట సీఎం. ఇద్దరూ కలిసి అటు ప్రభుత్వం, ఇటు పార్టీ కోసం పని చెయ్యకపోతే, ఎప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో తనకు తెలుసని వార్నింగ్ ఇచ్చారట. అక్కడితో శ్రీదేవి, సురేష్‌లు మెట్టు దిగారట. ఇక పోట్లాడుకోమని జగన్‌కు మాటిచ్చారట.
పార్టీలో కట్టుదాటుతున్న నేతలపై కఠిన చర్యలకు సిద్దమవుతున్నారట సీఎం జగన్. క్రమశిక్షణ ఉల్లంఘించినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని సంకేతాలిస్తున్నారట. పార్టీ సమస్యల పరిష్కారంపై స్వయంగా రంగంలోకి దిగుతున్నారట. ఇలాగే గొడవలు ముదిరితే స్థానిక ఎన్నికలతో పాటు మిగతా ఎలక్షన్స్‌లోనూ పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్న జగన్, ఆదిలోనే ఇష్యూలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని డిసైడయ్యారట. అందుకు తాజా నిదర్శనమే మొన్న తెగ పోట్లాడుకున్న పిల్లి సుభాష్, ద్వారంపూడిల స్నేహపూర్వక తేనేటి విందు.