AP CM YS Jagan: రాష్ట్ర సమస్యలే ప్రధాన ఏజెండా.. ఏపీ సీఎం జగన్ ఎంపీలకు నిర్ధేశం

AP CM YS Jagan | ప్రస్తుతం జరుగుతన్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై ప్రధానంగా చర్చించి, అవి పరిష్కారమయ్యేందుకు తమ వంతు పాత్ర పోషించాలని ఏపీ సీఎం జగన్మోహరెడ్డి ఎంపీలకు నిర్ధేశించారు.

Update: 2020-09-15 02:10 GMT

 YS Jagan (file photo)

AP CM YS Jagan | ప్రస్తుతం జరుగుతన్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై ప్రధానంగా చర్చించి, అవి పరిష్కారమయ్యేందుకు తమ వంతు పాత్ర పోషించాలని ఏపీ సీఎం జగన్మోహరెడ్డి ఎంపీలకు నిర్ధేశించారు. ఎంపీలతో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇలాంటి సమస్యలపై ప్రయత్నం చేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో పార్టీ ఎంపీలు కృషి చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం నిరంతరం ప్రయత్నించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీలోని పార్టీ ఎంపీలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

► రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి రావాల్సినవన్నీ రాబట్టాలి. ప్రత్యేక హోదా సాధన కోసం అవకాశం ఉన్న ప్రతి చోటా ప్రస్తావించాలి.

► ఏపీ దిశ బిల్లు, క్రిమినల్‌ లా (ఏపీ అమెండ్‌మెంట్‌) బిల్లు 2019తో పాటు, ప్రత్యేక దిశ కోర్టుల ఏర్పాటును కేంద్ర హోం శాఖ ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందాల్సి ఉంది. కాబట్టి వాటిని ఈ సమావేశాల్లో ప్రస్తావించాలి.

► పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ.3,232 కోట్లు రీయింబర్స్‌మెంట్‌ కింద రావాల్సి ఉంది. ప్రాజెక్టు పనులకు ఇంకా రూ.30 వేల కోట్లకు పైగా నిధులు వ్యయం చేయాల్సి ఉన్నందున, వాటి గురించి ప్రస్తావించాలి. ప్రాజెక్టులో 41.5 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ చేయడం కోసం రూ.3 వేల కోట్లు ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ఖర్చు చేయాల్సి ఉన్నందున, ఆ నిధులు ఇవ్వాలని కోరాలి.

► వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిహారం కింద రావాల్సిన రూ.3,622 కోట్లు వచ్చేలా చూడాలి.

యూఎల్‌బీ పెండింగ్‌ నిధులు

► 14వ ఆర్థిక సంఘం ప్రకారం 2015–2020 మధ్య అయిదేళ్లకు సంబంధించి రూ.3,635.80 కోట్లు పట్టణ స్థానిక సంస్థల (యూఎల్‌బీ)కు కేటాయించారు. ఇందులో ఇంకా రూ.582 కోట్లు నికరంగా రావాల్సి ఉంది. ఈ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలి.

► రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నందు వల్ల, 13 టీచింగ్‌ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చేలా సమావేశాల్లో కేంద్రాన్ని కోరాలి.

సీటీయూ రీలొకేట్

► రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూ)ను గిరిజనేతర ప్రాంతమైన విజయనగరం జిల్లా రెల్లిలో ప్రతిపాదించారు. అందువల్ల దానిని అదే జిల్లాలోని గిరిజన ప్రాంతమైన సాలూరులో ఏర్పాటయ్యేలా రీలొకేట్‌ చేయాలని కేంద్రాన్ని కోరాలి.

► శాసనమండలి రద్దుకు సంబంధించి ఈ ఏడాది జనవరి 27న శాసనసభ తీర్మానం చేసి పంపింది. ఇప్పటి వరకు దాన్ని కేంద్రం పట్టించుకోలేదు కాబట్టి, కేంద్ర హోం శాఖ వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించాలి.

► రాష్ట్రంలో కూడా రివర్స్‌ మైగ్రేషన్‌ (ఉపాధి కోల్పోయి సొంత ఊళ్ల బాట పట్టిన వలస కూలీలు) ఎక్కువగా ఉంది కాబట్టి గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌లో విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలను చేర్చేలా ఒత్తిడి తేవాలి.

► వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ల బిల్లు, రాష్ట్రంలో భూముల రీసర్వేకు సంబంధించిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బిల్లును కేంద్రానికి పంపాము. ఈ అంశాలపై కూడా దృష్టి పెట్టాలి.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు : ఎంపీ మిథున్‌రెడ్డి

► ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, జీఎస్టీ, 'ఉపాధి' పథకం విస్తరణ తదితర అంశాలపై సీఎం మాకు మార్గ నిర్దేశం చేశారని లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ నేత మిథున్‌రెడ్డి తెలిపారు. ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వ్యవహరించాలని సూచించారన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌ అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఆయా మంత్రులు, కార్యదర్శులను కలిసి మాట్లాడతామని వివరించారు. ఇంకా ఏమన్నారంటే..

► అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ విషయమై హోం మంత్రిత్వశాఖలో అందరినీ కలుస్తాం. సీఆర్‌డీఏ, ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ ఆరోపణలపై కూడా సీబీఐతో త్వరగా దర్యాప్తు జరిపించాలని కోరతాం.

► ఎంపీ రఘురామ కృష్ణరాజును సమావేశానికి పిలిచి, రావద్దన్నారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'ఆయనకు మేము పూర్తి గౌరవమిచ్చాం. కానీ ఆయన ప్రతిపక్షాల ఎజెండాతో పని చేస్తున్నారు. మేము ఆయన్ను సస్పెండ్‌ చేయడం లేదు. ఆయన్ను అనర్హునిగా ప్రకటించాలని పట్టు పడతాము' అని చెప్పారు. ప్రత్యేక హోదా అంశాన్ని అవకాశం వచ్చిన ప్రతిసారి లేవనెత్తుతామన్నారు.

► రాజ్యసభలో పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి.. ముఖ్యమంత్రితో సమావేశాన్ని సమన్వయం చేశారు. సీఎం కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి (ప్రజా వ్యవహారాలు), జీవీడీ కృష్ణమోహన్‌ (కమ్యూనికేషన్స్‌) తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News