అభివృద్ధి..సంక్షేమ పథకాలకు మద్దతివ్వండి : బ్యాంకర్లను కోరిన సీఎం జగన్
AP CM Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బ్యాంకర్లు మద్దతు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో జరిగిన 212వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాలతో పాటు వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలకు బ్యాంకర్లు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో దాదాపు 62 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పిన జగన్.. 'వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్' పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం కోసం ఏటా రూ.13,500 ఇస్తున్నామన్నారు. దీని వల్ల 1.25 ఎకరాలు, అంత కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ మొత్తం పెట్టుబడిగా దాదాపు సరిపోతుందన్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) ఏర్పాటు చేశామనీ, మొత్తం 10,641 ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్నామనీ వివరించారు.
గ్రామాల్లో వ్యవసాయ సహాయకుడు, రెవెన్యూ కార్యదర్శి, సర్వేయర్లు.. అందరూ కలిసి ఈ–క్రాపింగ్ చేస్తున్నారని చెప్పారు. ఈ–క్రాపింగ్ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందనీ, అందువల్ల బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆ రైతు ఈ–క్రాపింగ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉందొ లేదో చూడాలని చెప్పారు. 2020–21 ఖరీఫ్‌లో రూ.75,237 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.62,650 కోట్లు పంపిణీ చేసినట్లు జగన్ చెప్పారు.
కోవిడ్ సమయంలోనూ బ్యాంకులు రుణాలు మంజూరి చేశాయన్నారు. రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కల్పించడమే ధ్యేయంగా, ప్రతి గ్రామంలో గోదాములు, జనతా బజార్లు, మండల కేంద్రాల్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. వీటన్నిటికీ బ్యాంకర్లు సహకరించాలన్నారు. ఇక ప్రతి గ్రామానికి విలేజ్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, 51కి పైగా మందులతో పాటు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అందుబాటులో ఉండేలా చూస్తున్నామన్నారు. ఈ విలేజ్ క్లినిక్ లు ఆరోగ్యశ్రీ కి రిఫరల్ గా పనిచేస్తాయని చెప్పారు.
అదేవిధంగా వైఎస్సార్ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతొందన్నారు. ప్రతి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలతో వారికి స్థిరమైన జీవనోపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు గాను అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, రిలయెన్స్, అల్లానా గ్రూప్‌లతో ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు.