Union Budget 2024-25: అమరావతికి రూ. 15 వేల కోట్లు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు
Union Budget Rs 15000 Crore For Amaravati: ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక నిధులను ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు.
Union Budget 2024-25: బడ్జెట్ 2024-25 లో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. అమరావతి నిర్మాణం కోసం రూ. 15 వేల కోట్ల నిధులను కేటాయించారు. అవసరమైతే అదనంగా నిధులను కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో వైపు పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ 2024-25 ను ప్రవేశ పెట్టారు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక నిధులను ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవలనే దిల్లీలో పలువురు మంత్రులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. అంతేకాదు ఏపీ పునర్విభజన చట్టం కింద రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి పెద్దపీట వేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఉన్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం అభివృద్దికి నిధులు ఇస్తామని కేంద్రం ప్రకటించింది.
ఏపీలో రోడ్లు, రైల్వే పోర్టుల అభివృద్దికి కేంద్రం సహకారం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. బెంగుళూరు- హైద్రాబాద్, కొప్పర్తి-ఓర్వకల్-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ కు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నీళ్లు, విద్యుత్, రహదారుల అభివృద్దికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్ డీ ఏ కూటమి అధికారంలో వచ్చింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఏపీలోని ఎంపీల అవసరం కీలకంగా మారింది. ఏపీలోని ఎంపీల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సంఖ్యలో ఎంపీలున్నారు. ఇది ఏపీకి కేంద్ర బడ్జెట్ లో అధిక కేటాయింపులకు కారణమైందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.