Andhra Pradesh: గుంటూర్ లో 11 ఏళ్ల తరువాత మల్లి పుర పోరు
Andhra Pradesh: ఏపీలో పెద్ద కార్పొరేషన్‌లలో గుంటూరు ఒకటి. * గుంటూరులో 57 డివిజన్లకు గాను మొత్తం 550 నామినేషన్లు దాఖలయ్యాయి.
Andhra Pradesh: ఏపీలో పెద్ద కార్పొరేషన్‌లలో గుంటూరు ఒకటి. 1994లో నగరపాలక సంస్థగా ఏర్పాటైన గుంటూరులో ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలు జరగ్గా రెండుసార్లు టీడీపీ, ఓసారి కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. కొన్ని కారణాలతో గుంటూరులో 11ఏళ్లుగా పురపోరు జరగలేదు. దీంతో అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా గుంటూరులో 57 డివిజన్లకు గాను మొత్తం 550 నామినేషన్లు దాఖలయ్యాయి.
గుంటూరులో చెప్పుకోదగ్గ అభివృద్ధి మౌలిక వసతులు ఎక్కడా కనిపించవు. చెప్పాలంటే గత ప్రభుత్వాలు మొదలుపెట్టిన పనులు సైతం సగంలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం డ్రింకింగ్ వాటర్, రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ సమస్య ఉంది. రోజురోజుకు పెరిగే వాహనాల సంఖ్యతో శంకర్ విలాస్ ప్లైఓవర్ కూడా ఆ సమస్యను తీర్చలేకపోతుంది. అయితే 1968లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభం కాగా 1971లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
చరిత్ర కల్గిన అరండల్ పేట్ ఫ్లైఓవర్ విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. ప్రధానంగా రైల్వే లేన్‌పై ఉండటంతో దీనికి రైల్వేశాఖ అమనుతి అవసరం. అందుకే అండర్ పాస్ ఏర్పాటు చేయాలని 2017లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాహనాలు అండర్ పాస్ గుండా మళ్లించి.. రైల్వే అనుమతి వచ్చాక వంతెనను కూల్చి కొత్త దానిని నిర్మించాలని భావించారు. అయితే అది ఇప్పటికీ అమలు కావడం లేదు.
గుంటూరు కార్పొరేషన్‌ను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజధాని ప్రాంతానికి సమీపంలోని కార్పొరేషన్ కావడంతో విజయంపై ప్రత్యేక దృష్టి సారించింది. చెప్పాలంటే అమరావతి నినాదం గట్టిగా వినిపించే ప్రాంతంలో జెండా ఎగురవేయాలని చూస్తోంది. మరోవైపు ఇక్కడ ఓటమి చెందితే తమ ఉనికికే ప్రశ్నార్థకమని టీడీపీ భావిస్తోంది. ఎమ్మెల్యే మద్దాలి గిరి పార్టీ మారడంతో టీడీపీ నాయకత్వం ఇబ్బంది పడుతోంది.
ఇకపోతే ఎన్నికల్లో ఈసారి మిత్రపక్ష కూటమి రంగంలోకి దిగింది. స్థానికంగా ఉన్న సామాజిక పరిస్థితులు, ఇతర అంశాల కారణంగా గెలుపుపై ఆశలు పెట్టుకుంది బీజేపీ-జనసేన అభ్యర్థులు. మొత్తం 57 డివిజన్లు ఉండగా వీటిలో ఇద్దర కలిసి 48 చోట్ల పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా 46 స్థానాల్లో గెలిచి మేయర్ స్థానంలో కీలకం అవుతామంటున్నారు. గెలుపు నేపథ్యంలో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు ఎత్తి చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే 57 డివిజన్లకు గాను టీడీపీ సీపీఐకి మూడు డివిజన్లు కేటాయించింది. అటు ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన నేతలు అగ్రనేతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. తమ మేయర్ అభ్యర్థిగా టీడీపీ మూడి రవీంద్రను బరిలో దించగా వైసీపీ కావటి మనోహర్ నాయుడును ఎంపిక చేసింది. సుదీర్ఘ కాలం తర్వాత మేయర్ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మరి గుంటూరు ఓటర్లు ఎటువైపు ఉన్నారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.