Amaravati: 600 రోజులకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు
Amaravati: రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు * న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో భారీ బైక్ ర్యాలీ
Amaravati: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ చేపట్టిన ఆందోళనలు నేటితో 600 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో బైక్ ర్యాలీ చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. దీంతో అమరావతి పరిసర గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదని తేల్చిచెప్పారు. అయితే.. ఆంక్షలు పెట్టినా ర్యాలీ కొనసాగుతుందని అమరావతి జేఏసీ తేల్చి చెప్పింది. దీంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టు నుండి మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకూ బైక్ ర్యాలీ కొనసాగిస్తామని అమరావతి రైతులు స్పష్టం చేస్తున్నారు.
ఎవరికి వారు శిబిరాల్లో నిరసన కార్యక్రమాలు చేసుకోవాలని సూచించారు పోలీసులు. కోవిడ్ దృష్ట్యా ర్యాలీకి అనుమతి సాధ్యం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో 3 రాజధానులకు మద్దతుగా పరిరక్షణ సమితి ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. రెండువర్గాలు ప్రదర్శనలు నిర్వహిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ అనుమతి సాధ్యం కాదన్నారు.