Nyayasthanam to Devasthanam: నేటి నుంచి అమరావతి రైతుల ప్రజా పాదయాత్ర
* న్యాయస్థానం టు దేవస్థానం పేరిట పాదయాత్ర * ఉ.9 గంటలకు తుళ్లూరు రైతు దీక్షా శిబిరం నుంచి ప్రారంభం
Nyayasthanam to Devasthanam: తమ నిరసనలు మొదలై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా న్యాయస్థానం టు దేవస్థానం పేరిట ప్రజా పాదయాత్రకు పిలుపునిచ్చారు రాజధాని రైతులు. అమరావతి పరిరక్షణ సమితి, రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వ్యంలో ఇవాళ ఉదయం 9 గంటల 5 నిమిషాలకు తుళ్లూరు రైతు దీక్షాశిబిరం వద్ద జాతీయ జెండా, అమరావతి జెండాలను ఎగరవేసి యాత్రను ప్రారంభించనున్నారు. డిసెంబర్ 17లోపు తిరుపతి వరకు సుమారు నాలుగు వందల కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని పేరుతో 45 రోజుల పాటు రైతులు, మహిళలు పాదయాత్ర చేయనున్నారు.
ఇక తమ పాదయాత్రకు అనుమతి కోరుతూ డీజీపీకి లేఖ రాశారు రైతులు. అయితే ఎన్నికల కోడ్, తదితర సమస్యల వల్ల అనుమతి నిరాకరించారు. హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుమతి లభించింది. దీంతో షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు డీజీపీ.
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాదయాత్ర చేయాలని అన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగరాదని హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీసులకు సహకరించాలని కోరారు. పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు, డీజే సౌండ్లు, బహిరంగ సభలు నిర్వహించొద్దన్నారు డీజీపీ.
తమ తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములను ప్రజల కోసం ఇచ్చామని, ప్రజలకు ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకే ఈ పాదయాత్ర అని అంటున్నారు రాజధాని మహిళా రైతులు. భావితరాల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూముల విషయంలో తాము పడుతున్న కష్టాలను ప్రజలకు పాదయాత్ర రూపంలో వివరిస్తామంటున్నారు.
కులమతాలకు అతీతంగా దేవాలయాలు, చర్చిలు, మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేస్తామని చెబుతున్నారు. రోజులో 12 గంటల పాదయాత్ర ఎక్కడ ముగిస్తే అక్కడ బస చేస్తామంటున్నారు. న్యాయస్థానం తర్వాత తమకు దేవాలయమే న్యాయస్థానమంటున్న మహిళా రైతులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటామని అంటున్నారు.