Amaravati: 40వ రోజుకు చేరుకున్న అమరావతి రైతల మహాపాదయాత్ర
Amaravathi: నేడు మండపేట నియోజకవర్గంలో రైతుల పాదయాత్ర
Amaravathi: అమరావతి రైతుల మహా పాదయాత్ర 40వ రోజుకు చేరింది. నిన్న మండపేట నియోజకవర్గం కేశవరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. అనపర్తి మీదుగా రామవరం వరకు సాగింది. దాదాపు 14 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్ర చేశారు. అనంతరం రామవరంలోని కర్రి జట్లారెడ్డి కల్యాణ మండపంలో రైతులు బస చేశారు. ఇవాళ ఉదయం పాదయాత్ర రామవరం నుంచి కుతుకులూరు చింతలరోడ్డు మీదుగా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం, సీతంపేట మీదుగా సోమేశ్వరం చేరుకుంటుంది.
ఇక అమరావతి రైతుల మహా పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతంలోనూ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. రైతులకు పుష్పనీరాజనాలు పలుకుతూ గ్రామీణ మహిళలు స్వాగతించారు. అడుగడుగునా మహిళల పూల హారతులు, చిరు ఆతిథ్యాలతో ఘన స్వాగతం పలికారు. గొప్పసంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కొన్ని సెంటర్లలో యువత బాణాసంచా కాల్చి రైతులకు స్వాగతం పలికారు. రెట్టించిన ఉత్సాహంతో అమరావతి రైతులు, మహిళా రైతులు పాదయాత్రను ముందుకు నడిపించారు. అమరావతి రైతులకు టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ తదితర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలపడంతో గ్రామీణ రోడ్లనీ జనసందోహంగా మారాయి.