Amara Raja Group: ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోనున్న అమరరాజా?
Amara Raja Group: అమరరాజా బ్యాటరీస్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకోడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Amara Raja Group: అమరరాజా బ్యాటరీస్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకోడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకైతే కొత్త ప్లాంట్‌ను ఏపీలో పెట్టకూడదని ఓ నిర్ణయానికి రాగా అవసరమైతే ఉన్న ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించేందుకు సిద్ధం అనే సంకేతాలు పంపించింది. నిజానికి గత ఏప్రిల్‌లోనే ప్లాంట్ మూసేయమంటూ డైరెక్టుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నోటీసులు పంపింది. హైకోర్టు స్టే ఇవ్వడంతో యథావిధిగా కొనసాగుతోంది.
మరోవైపు పొరుగు రాష్ట్రం తమిళనాడు పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు అమరరాజా సంస్థలను ఆకర్షించింది. నిండా 50కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తమిళనాడులో చేరుకొనే అవకాశం ఉండటంతో అదే ఉత్తమమని భావించినట్లు స్పష్టమౌతోంది. అదే సమయంలో అమరరాజా గుడ్‌విల్‌కు తమిళ సర్కార్ కూడా ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించడంతో నిర్ణయం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తరలింపు నిర్ణయానికి సంస్థపై వేధింపులే కారణమని తెలుస్తోంది. రెండు రోజులకు ఒక డిపార్ట్‌మెంట్ అధికారులు వచ్చి, తనిఖీలు చేయాలంటూ వేధిస్తున్నారని సంస్థ చెబుతోంది. మొదట పొల్యూషన్ బోర్డ్ వచ్చింది, తరువాత కార్మిక శాఖ, ఆ తరువాత పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ, చివరికి ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కూడా వచ్చింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు కరకంబాడిలోని అమరరాజా ఫ్యాక్టరీకి వెళ్లి, తనిఖీలు చేస్తుండడంతో తాము కూడా విసిగిపోయామని సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు.