AP MEGA DSC: అలర్ట్..మెగా డీఎస్సీతోపాటు టెట్..సర్కార్ కీలక నిర్ణయం
AP MEGA DSC: అభ్యర్థులకు అలర్ట్.. మెగాడీఎస్సీతోపాటు టెట్ నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1 న నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. కాగా నేడు పాత టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
AP MEGA DSC: మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఏపీలోని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్ లో అర్హత సాధించనివారు..ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీకి ఒకేసారి తేదీల్లో అటుఇటుగా మార్పులు చేసి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
మొదట టెట్ నిర్వహించి తర్వాత..డీఎస్సీకి రెడీ అయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. తర్వాతే డీఎస్సీ పరీక్ష ఉంటుంది. జులై 1న దీనికి సంబంధించిన ప్రకటనలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. గత సర్కార్ ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి ఆ స్థానంలో కొత్తగా 16,347 సోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటించనున్నారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నవారు ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక నుంచి ప్రతిఏటా డీఎస్సీ నిర్వహించే అంశంపై కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏ విద్య సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు, అవసరం మేరకు డీఎస్సీ నిర్వహిస్తే బాగుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను నేడు విడుదల కానున్నాయి. ఈ టెట్ కు 2.67 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2.35లక్షల మంది పరీక్ష రాసారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాలు విడుదల చేయలేదు.