సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగికదాడి ఆరోపణలు:వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు
అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదిమూలం వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆయన టీడీపీలో చేరికను నియోజకవర్గంలోని కొందరు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించారు. తనపై మూడుసార్లు లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె చెప్పారు. హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో బాధితురాలు గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని ప్రైవేట్ వీడియోలను ఆమె విడుదల చేశారు. ఈ విషయమై న్యాయం చేయాలని ఆమె కోరారు.
పదే పదే ఎమ్మెల్యే ఫోన్ చేయడంపై తన భర్త నిలదీస్తే లైంగికదాడి విషయం చెప్పానన్నారు. అయితే ఎమ్మెల్యే నిజస్వరూపం బయటపెట్టేందుకు తనకు తన భర్త పెన్ కెమెరా ఇచ్చారని... దీని సహాయంతోనే ఈ వీడియోలను రికార్డు చేసినట్టుగా ఆమె చెప్పారు. తనతో పాటు చాలామంది మహిళలపై ఆయన వేధింపులకు దిగారని ఆమె ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదిమూలం వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆయన టీడీపీలో చేరికను నియోజకవర్గంలోని కొందరు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా వ్యతిరేకించినవారిలో ఆమె కూడా ఉన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ఆదిమూలం విజయం కోసం తాము ప్రయత్నించినట్టుగా ఆమె తెలిపారు. గతంలో ఆయన వైసీపీలో ఉన్న సమయంలో టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకించినందునే తనపై కక్షగట్టి ఇలా చేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయం బయటచెబితే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె తెలిపారు.
తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఫిర్యాదు చేసినట్టుగా ఆమె చెప్పారు. ఈ విషయమై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వివరణ కోసం ప్రయత్నిస్తే ఆయన ఫోన్ కు అందుబాటులోకి రాలేదు. ఈ ఆరోపణలను తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుందని సమాచారం. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా ఎమ్మెల్యే ఆ పార్టీ చర్యలు తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.