Andhra Pradesh: ఏపీలో మళ్లీ నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వం
Andhra Pradesh: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం
Andhra Pradesh: ఏపీలో మళ్లీ నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వంగా మారింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరుతుండగా కరోనా నేపథ్యంలో కుదరదని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పింది. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో కరోనా ఉందని తాము చెప్పినా వినకుండా ఎన్నికల నిర్వహణకు ముందుకువెళ్లి ఇప్పుడు కుదరదనడంపై ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ దీనిపై రాజకీయాలు మాత్రం ఆగడం లేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంతో ఊపుమీదున్న అధికార వైసీపీ ఈ ఎన్నికలు కూడా జరిగిపోవాలని కోరుకుంటోంది. అదీ తాము ఎప్పటినుంచో విభేదిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ హయాంలోనే. దీంతో మరోసారి ఎస్‌ఈసీ వర్సెస్ సర్కార్‌గా మారింది పరిస్థితి.
ఏపీలో పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తే వారం రోజుల్లో పూర్తవుతాయని అయితే, ఎన్నికలను నిర్వహించకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కరోనా వ్యాక్సిన్ ను సాకుగా చూపుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
కరోనా వ్యాక్సిన్ కోసమని మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆనాడు నిమ్మగడ్డను కోరామని అయినా అప్పుడు ఆయన వినలేదని చెప్పారు. ఇప్పుడేమో ఆరు రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలకు వ్యాక్సిన్ సాకు చూపుతున్నారని విమర్శించారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో కోట్లాది మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు.
గతంలో కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలని, తగ్గాక వద్దని కోరిన వైసీపీ ఇఫ్పుడు నిమ్మగడ్డ హయాంలోనే ఎన్నికలు పూర్తి కావాలని ఒత్తిడి తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. నిమ్మగడ్డకు పరిషత్ ఎన్నికలు పెట్టాలని తాము ఆదేశాలు ఇవ్వలేమంటూ హైకోర్టు తేల్చిచెప్పింది.