ఉండవల్లిలో చంద్రబాబుకు ఘనస్వాగతం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు నెలల తర్వాత విజయవాడలో ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు నెలల తర్వాత విజయవాడలో ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు. కరోనాకి ముందు హైదరాబాద్ కి వెళ్లిన చంద్రబాబుకి కేంద్రం లాక్ డౌన్ విధించడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ మరోసారి పొడిగిస్తూ ఆంక్షలు సడలించడంతో చంద్రబాబు రెండు రాష్ట్రాల డీజీపీలకు అనుమతి కోసం లేఖ రాశారు. తెలంగాణ డీజీపీ నుంచి అనుమతి రాగా.. తర్వాత ఏపీ డీజీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో రెండు నెలల తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు.
వాస్తవానికి చంద్రబాబు ఈ రోజు (సోమవారం) విశాఖపట్టణం వెళ్లి అక్కడ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను పరామర్శించాల్సి అనుకున్నారు కానీ, ఆయన ప్రయాణించే విమానం చివరి నిమిషంలో రద్దు కావడంతో ఆయన వైజాగ్ పర్యటన రద్దు అయింది. దీంతో ఆయన రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి అమరావతికి పయనమయ్యారు. ఆయనకు ఏపీలోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు, అమరావతి రైతులు ఘనస్వాగతం పలికారు. కరకట్టపై నిలబడిన పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు అభివాదం చేశారు. చంద్రబాబు వెంట ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఉన్నారు.