తల్లి నమ్మిన వ్యక్తే దారుణానికి ఒడిగట్టిన వైనం.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన 13 ఏళ్ల బాలిక
Guntur: ధైర్యంతో కేబుల్ పైపును పట్టుకుని వేలాడుతూ...
Guntur: 13 ఏళ్ల బాలిక ఎంతో ధైర్యం చూపింది. తల్లిని నమ్మించిన ఓ వ్యక్తే.. అందరినీ గోదావరి నదిలోకి తోసేయగా... ఆ చిన్నారి మాత్రం సమయస్ఫూర్తితో తనను తాను కాపాడుకుని.. ప్రాణాపాయం నుంచి బయటపడింది.
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పుప్పాల సుహాసిని భర్తతో విభేదాలతో విడిపోయింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్‌తో పరిచయం ఏర్పడి.. ఆయనతోనే సహజీవనం చేస్తోంది. వీరికి ఓ కూతురు జన్మించింది. అయితే ఇటీవల సురేష్, సుహాసిని మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమెను, కూతుళ్లను మట్టుబెట్టాలనుకున్నాడు సురేష్.. రాజమహేంద్రవరంలో దుస్తులు కొందామంటూ ముగ్గురిని వెంటబెట్టుకుని కారులో బయలు దేరాడు. రాత్రంతా వివిధ ప్రాంతాల్లో తిప్పి... తెల్లవారుజామున 4 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని గౌతమి గోదావరి పాత వంతెన వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ సెల్ఫీ తీసుకుందామని చెప్పి... పిల్లలతో సహా రెయిలింగ్ వద్ద సుహాసినిని కూడా పిట్టగోడపై నిలబెట్టాడు. ఒక్కసారిగా వారందరినీ నదిలోకి తోసేసి కారులో పరారయ్యాడు. సుహాసిని, జెర్సీ నదిలో పడిపోయారు..
కానీ 13 ఏళ్ల కీర్తనకు మాత్రం వంతెన పక్కగా వేసిన కేబుల్ పైపు చేతికి అందడంతో దాన్ని గట్టిగా పట్టుకుంది. ఇంతలో తన జేబులో మొబైల్ ఫోన్ ఉన్న విషయం గుర్తుకొచ్చింది. ఒక చేత్తో పట్టు తప్పిపోకుండా పైపు పట్టుకుని వేలాడుతూనే... మెల్లగా మరో చేతితో ఫోన్ బయటకు తీసి.. కింద పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని.. 100 నంబరుకు కాల్ చేసి తానున్న పరిస్థితిని పోలీసులకు తెలిపింది. వెంటనే రావులపాలెం ఎస్‌ఐ వెంకటరమణ తన సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకుని బాలికను రక్షించారు. అయితే మహిళ సుహాసిని, జెర్సీ గల్లంతయ్యారు.
సుమారు అరగంట పాటు చీకట్లో కీరన్త పైపు ఆధారంతో వేలాడుతూ ఉండడమే కాక... ఫోన్ చేసి తమకు చెప్పిన వైనాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.