Coronavirus: కరోనాను జయించిన 80 ఏళ్ల బామ్మ

Coronavirus: అనంతపురంలోని ఆశా హాస్పటల్‌లో చికిత్స పొందిన బామ్మ * 65కు పడిపోయిన ఆక్సిజన్ శాచురేషన్

Update: 2021-05-21 10:54 GMT

Representational Image

Coronavirus: మాయదారి కరోనా యువత ప్రాణాలను హరిస్తున్న తరుణంలో 80 ఏళ్ల బామ్మ వైరస్ ను జయించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ దొరక్కపోయినా... ప్రైవేటు ఆసుపత్రిలో అతికష్టంగా చేరి సునాయాసంగా వ్యాధి నుంచి బయటపడింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో డిస్చార్జ్ అయింది బామ్మ.

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నిట్టూరుకు చెందిన భాగ్యలక్ష్మి అనే వృద్ధురాలు ఇటీవల కరోనా బారిన పడింది. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లేకపోవడంతో పలు ప్రైవేటు ఆసుపత్రులకు తిరిగి తిరిగి చివరికి తాడిపత్రిలోని ఆశా ఆసుపత్రిలో చేరింది. అక్కడే ఆక్సిజన్ బెడ్‌పై చికిత్స తీసుకుంది. కరోనా వచ్చినప్పటికీ ధైర్యంగా ఉంటూ వైద్యుల సూచనలు పాటించింది. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడంతో ఆమెకు ఆరోగ్య శ్రీ కింద వైద్యులు చికిత్సలు అందించి ఆమెను కొవిడ్ ముప్పు నుంచి కాపాడారు.

హాస్పటల్ లో జాయిన్ అయిన సమయంలో బామ్మకు ఆక్సిజన్ శాచురేషన్ 65 ఉండేదని డాక్టర్లు చెబుతున్నారు. పది రోజులుగా వైద్యం అందించడంతో ఇప్పుడు ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని అన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ శాచురేషన్ 96 ఉందని ఆమె ఆరోగ్యంగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. 80 ఏళ్ల వద్ధురాలు కరోనాను జయించడం తమకు గర్వకారణమని అంటున్నారు. కరోనా సోకిందని భయపడుతున్నవారికి ఈ బామ్మ ఆదర్శమని చెబుతున్నారు.

ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఇది సాధ్యమైందని ఆమె మనవడు సంతోష్ అంటున్నారు. అనారోగ్యంగా ఉన్న ఆమెకు ప్రత్యేక చికిత్సలు నిర్వహించి కోలుకునే విధంగా చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యంగా ఉండి ఆందోళన, టెన్షన్ తో సమస్యలు కొని తెచ్చుకుంటున్న వారికి ఈ బామ్మ ఆదర్శంగా నిలుస్తుందని వైద్యులు అంటున్నారు.

Tags:    

Similar News