Vijayawada Floods: విజయవాడ మునిగిపోవడానికి 5 ప్రధాన కారణాలు... ఇకనైనా చేయాల్సిందేమిటి?

నివాస ప్రాంతాలు నీట మునగడానికి ప్రకృతి బీభత్సం కన్నా మానవ తప్పిదమే ప్రధాన కారణం. ఎందుకంటే, బుడమేరు పొంగితే ఏం జరుగుతుందో ఏపీ ప్రజలకు, ముఖ్యంగా విజయవాడు వాసులకు కొత్తగా చెప్పక్కర్లేదు.

Update: 2024-09-05 14:40 GMT

Vijayawada Floods: విజయవాడ మునిగిపోవడానికి 5 ప్రధాన కారణాలు... ఇకనైనా చేయాల్సిందేమిటి?

విజయవాడ నగరం వరదల్లో మునిగిపోవడంతో బుడమేరు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు కూడా ఇప్పుడు దాని చుట్టే తిరుగుతున్నాయి. గత 50 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదవడంతో నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. 2005 నాటి వర్ష బీభత్సానికి రెట్టింపు విధ్వంసం ఈసారి వరదల వల్ల జరిగినట్లు తెలుస్తోంది.

అప్పుడూ ఇప్పుడూ వరద విషాదానికి బుడమేరే కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ల మధ్య మాటల యుద్ధంలో కూడా బుడమేరు పేరే వినిపిస్తోంది. పాయకపురం, అజిత్ సింగ్ నగర్, వైఎస్సార్ కాలనీలు నీట మునగడానికి మీరంటే మీరే కారణమని ఇప్పటి ప్రభుత్వ నేతలు, గత ప్రభుత్వ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

వీరి ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. నివాస ప్రాంతాలు నీట మునగడానికి ప్రకృతి బీభత్సం కన్నా మానవ తప్పిదమే ప్రధాన కారణం. ఎందుకంటే, బుడమేరు పొంగితే ఏం జరుగుతుందో ఏపీ ప్రజలకు, ముఖ్యంగా విజయవాడు వాసులకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇన్నేళ్ళు ఆ ప్రాంతానికి ప్రాతనిధ్యం వహిస్తున్న నాయకులకు కూడా ఈ సంగతి బాగా తెలుసు. కానీ, ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం కూడా ఈ విషయంపై శ్రద్ధ పెట్టలేదు. ఫలితమే ఈ విధ్వంసం. జల వనరుల శాఖ నిర్లక్ష్యం వరద పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది.

విజయవాడ వరదవాడగా మారడానికి ప్రధాన కారణాలేంటో చూద్దాం.

1. వెలగలేరు వద్ద కట్టిన హెడ్ రెగ్యులేటర్ నిర్వహణ దారుణంగా ఉండడం ఒక ప్రధాన కారణం. డ్రెయిన్‌కు పగుళ్లు వచ్చినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. బుడమేరులో వరద పెరిగితే ప్రమాదం రాకుండా 10,000 క్యూసెక్కుల నీటిని దారి మళ్ళించడానికి ఉద్దేశించిన బుడమేరు డైవర్షన్ చానల్ (బీడీసీ) ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. భారీ వర్షాలతో కేవలం నాలుగు రోజుల్లో ఖమ్మం నుంచి బుడమేరుకు 60 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. దాంతో, పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిన అవసరం లేకుండా ఇవాళ కళ్లెదుటే కనిపిస్తోంది.

2. ఒకవేళ బుడమేరు ప్రవాహం కృష్ణలో కలిసినా ప్రకాశం బరాజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులకు మించి ఉండకూడదు. కానీ, బరాజ్‌కు భారీయెత్తున వరద నీరు వచ్చి చేరింది. దాదాపు 12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలాల్సి వచ్చింది. దాంతో, బుడమేరు వరద కృష్ణానదిలో కలవకుండా జనావాస ప్రాంతాల మీదకు మళ్ళింది. దాంతో, జక్కంపరూడి, వాంబే కాలనీ, మిల్క్ ఫ్యాక్టరీ తదితర ప్రాంతాలు నీటమునిగాయి.

3. బుడమేరు ఆధునీకరణ కోసం 2014-19 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన రూ. 500 కోట్ల విలువైన ప్రతిపాదనలు ముందుకు కదల్లేదు. వాగు పరీవాహక ప్రాంతంలో ప్లాట్లు వెలుస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

4. వరద ముంచుకొస్తుంటే జలవనరుల విభాగం అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ పరిస్థితి తీవ్రతకు అనుగుణంగా స్పందించలేకపోయారు. బుడమేరుకు వేరే వరదలు వచ్చి చేరకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. వీటీపీఎస్ తదితర ప్రాంతాల్లో వరదను నివారించేందుకు జలవనరుల అధికారులు వెలగలేరు వద్ద గేట్లు ఎత్తినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అదే సమయంలో విజయవాడ మున్సిపల్ అధికారులను అలర్ట్ చేయలేదు. దాంతో, ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించే సమయం కుడా అధికారులకు చిక్కలేదు.

5. బుడమేరు కాల్వ పూర్తి కెపాసిటీ 11,000 క్యూసెక్కులు. వరద ప్రవాహాన్ని నియంత్రించడం కోసం వెలగలేరు వద్ద హెడ్ రెగ్యులేటర్‌ను 1970లో నిర్మించారు. ఆ తరువాత అదనపు జలాలను కృష్ణానదికి మళ్ళించడానికి బుడమేరు డైవర్షన్ చానెల్ కట్టారు. ఈ బీడీసీ ద్వారా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ వ్యర్థాలు కృష్ణలో కలుస్తున్నాయి.

2005లో భారీ స్థాయిలో వరదలు ముంచెత్తినప్పుడు బుడమేరు వద్ద 70,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. అప్పుడు జరిగిన భారీ నష్టానికి రాజకీయా పార్టీలు ఇప్పట్లాగే పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. బాధితుల తరఫును కొన్ని రాజకీయ పక్షాలు ఉద్యమాలు కూడా చేశాయి.

భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా బుడమేరు కాల్వ కెపాసిటీని పెంచుతూ ఆధునీకరించాలని, విజయవాడను వరద ముంపు నుంచి కాపాడాలని ప్రతిపాదనలు వచ్చాయి.

కానీ, ప్రతిపాదనలు ఫైళ్ళలో మగ్గుతున్నాయి. వరద నీరు మాత్రం జనావాసాలను ముంచెత్తుతోంది.

Tags:    

Similar News