హాట్ హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Update: 2020-11-30 11:11 GMT

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా మొదలయ్యాయి. మొదటి రోజే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకవైపు శీతాకాలం మరోవైపు తుఫాన్ ప్రభావంతో బయట వాతావరణం కూల్‌కూల్‌గా ఉంటే ఏపీ అసెంబ్లీలో మాత్రం వెదర్ హాట్ హాట్‌గా మారింది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సవాళ్లు, ప్రతి సవాళ్లతో సభ హీటెక్కింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేశంతో ఊగిపోగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సైతం అంతేస్థాయిలో కౌంటరిచ్చారు.

పంట నష్ట పరిహారంపై ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ టీడీపీ ఆరోపించడంతో వైసీపీ సభ్యులు దీటుగా స్పందించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్నదాతలను ఆదుకుంటున్నామని అధికారపక్షం కౌంటరిచ్చింది. దాంతో, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్ పోడియం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. సభను ఆర్డర్‌లో పెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ టీడీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో చంద్రబాబుతో సహా 13మందిని ఒక్కరోజుపాటు సస్పెన్షన్ వేటేశారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగలేదంటూ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం పీకుతారంటూ చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. కళ్లు పెద్దవి చేసి రౌడీయిజం చేస్తే ఎవరూ భయపడేవాళ్లు లేరన్నారు జగన్మోహన్‌రెడ్డి.

Tags:    

Similar News