కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులు అరుదైన ఘనత సాధించారు. కరోనా సోకిన 127 ఏళ్ల వృద్ధురాలికి మెరుగైన చికిత్స అందించి, ఆమె కోలుకునేలా చేశారు. వృద్ధులకు కరోనా సోకితే బయటపడటం కష్టమని భావిస్తున్నపరిస్థితుల్లో ఏకంగా 127 ఏళ్ల వృద్ధురాలు కోలుకోవడం వెనుక ఆసుపత్రి సిబ్బంది కృషి ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు. కిర్లంపూడి మండలం జగపతినగరానికి చెందిన రాఘవమ్మ 1893లో జన్మించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆగస్టు 31న కన్నారపు వీర రాఘవమ్మ ఆసుపత్రిలో చేరారని, గురువారం డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఆమె కోలుకుంటారని అనుకోలేదని చెప్పారు. ఆ సమయంలో పరిస్థితి విషమంగా ఉందన్నారు. వృద్ధులకు కరోనా వస్తే కోలుకోవడం కష్టమని బయట అనుకోవడం విన్నానని..కానీ, ఆసుపత్రి వైద్యుల కృషితో ఈ రోజు ఆమె కోలుకొని చలాకీగా తిరుగుతున్నట్లు చెప్పారు.