Telugu Akademi: తెలుగు అకాడమీ స్కామ్‌లో 10 మంది నిందితులు అరెస్ట్
Telugu Akademi: అకాడమీ అకౌంట్స్ చీఫ్ రమేష్‌తో పాటు పలువురు అరెస్ట్...
Telugu Akademi: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ వ్యవహారం ఓ కొలిక్కి వస్తోంది. 8రోజుల విచారణ అనంతరం నిధుల మిస్సింగ్‌పై త్రిసభ్య కమిటీ.. విద్యాశాఖ కార్యదర్శికి నివేదిక సమర్పించింది. తెలుగు అకాడమీ అధికారుల నిర్లక్ష్యమే నిధులు మాయం కావడానికి ప్రధాన కారణమని తేల్చింది. ఈ వ్యవహారంలో A-1 నిందితుడు మస్తాన్‌వలీకి ఏడు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. తెలుగు అకాడమీ అకౌంట్స్ చీఫ్ రమేష్‌తో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.
తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలుగు అకాడమీకి సంబంధించిన నిధులు అన్ని బ్యాంకుల్లో కలిపి 3వందల 40 కోట్లు కాగా .. మూడు బ్యాంక్ అకౌంట్ల నుంచి నిధులు మాయమయ్యాయని త్రిసభ్య కమిటీ నివేదికలో తెలిపింది. కార్వాన్ అకౌంట్ నుంచి 43 కోట్లు, సంతోష్ నగర్ అకౌంట్ నుంచి 12 కోట్లు, చందా నగర్ అకౌంట్ నుంచి 10 కోట్లు మిస్ అయినట్టు పేర్కొంది. మిగతా 31 అకౌంట్లలో నిధులు సేఫ్‌గా ఉన్నాయని నివేదికలో తెలిపింది. బాధ్యులపై చర్యలే కాకుండా, శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని నివేదికలో సూచించింది త్రిసభ్య కమిటీ.
నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డ ముఠాలో మొత్తం 10 మంది సభ్యులను అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ కొల్లగొట్టిన ముఠా నుంచి కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో A-1గా యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీ, A-2గా ఏజెంట్ రాజ్‌కుమార్, A-3గా సత్యనారాయణరాజు, A-4గా పద్మావతి, A-5గా మొహిద్దీన్, A-6గా ఏజెంట్ చుందూరి వెంకట్ సాయి, A-7గా ఏజెంట్ నందూరి వెంకట్, A-8గా ఏజెంట్ వెంకటేశ్వరరావు, A-9గా తెలుగు అకాడమీ అకౌంటెంట్ రమేష్, A-10గా కెనరా బ్యాంక్ మేనేజర్ సాదన పేర్లు ఉన్నాయి.