రైతన్నకు సంక్రాతి కానుక.. 'రైతుకే అవని పై' జానపదం!

సంక్రాంతి పండగ అంటేనే పుడమితో పెనవేసుకున్న అనుబంధం. ఆరుగాలం శ్రమించిన రైతన్న ఆనందంతో చేసుకునే వేడుక. రైతన్నకు చిరు కానుకగా అందిస్తోంది హెచ్ఎంటీవీ..

Update: 2021-01-15 06:22 GMT

రైతన్నలకు హెచ్ఎంటీవీ సంక్రాంతి కానుక 

సంక్రాంతి పండగ అంటేనే పుడమితో పెనవేసుకున్న అనుబంధం. ఆరుగాలం శ్రమించిన రైతన్న ఆనందంతో చేసుకునే వేడుక. కర్షక కష్టానికి దక్కే కూసింత ప్రతిఫలాన్ని దేవుడిచ్చిన కానుకగా సంబరంగా జరుపుకునే నాలుగు రోజుల ఉత్సవం. తరతరాలుగా అన్నీ మారాయి. అంతా మారింది. బళ్ళు ఓడలు అయ్యాయి. కానీ.. రైతు మాత్రం మట్టినే నమ్ముకుని.. ఆ మృత్తికలోనే తన జీవితాన్ని ధారబోస్తూ సేద్యం చేస్తూ వస్తున్నాడు. అందుకు ప్రతిఫలంగా మానమేమిస్తున్నాం? పండగ పూటా ఆకలి బాటలో ప్రస్తుతం రైతులు దిగాలుగా కూచునే స్థితి.

సంక్రాంతి తెచ్చే క్రాంతి ఇప్పుడు రైతన్నలో కనిపించడం లేదు. సిరులు పండించాలని చూసే కర్షక మిత్రులు ఇప్పుడు కన్నీటి సేద్యం చేస్తున్నారు. ఆ వ్యదార్ధ జీవిత పయనాన్ని చక్కని పాట రూపంలో మీకందిస్తోంది హెచ్ఎంటీవీ.

కడారి శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన అక్షరాల చినుకులు.. ధరణీ తలాన విరామ మెరుగక.. శ్రమిస్తూ.. నిత్య జీవన సమరంతో.. అందరికీ బుక్కెడు బువ్వ పెడుతున్న రైతన్నకు చిరు కానుకగా అందిస్తోంది హెచ్ఎంటీవీ..

సాయి శ్రీకాంత్ గాన మాధుర్యం..ఎల్ఎం ప్రేమ్ సంగీతంలో ఒదిగిపోయి వినిపిస్తున్న ఈ పాట.. ప్రసాద్ వర్మ ఫొటోగ్రఫీలో బ్రహ్మం నృత్యరీతులతో లక్కీ ఎకారీ దర్శకత్వ సారధ్యంలో ఎలా ఉందొ మీరూ చూడండి!

Full View


పాటలోని పలుకులు ఇవి..

సాకి......

ధరణీ పంచన చేరి దాతలై నాము.....

పుడమి సాక్షిగా.. నింగి తారలైనాము..

రైతుకే అవని పై మెతుకు లే కుండేను...

దేవుడా.... ఈ లోకాన.....

పల్లవి;-

కర్షక కన్నీటి వ్యధలాయేన...

బ్రతుకు కష్టాల కడలిలో నడకాయేన...

సిరులు పండించి...

నఖశిఖల స్వేదాల్ని చిందించి....

పండించిన నాపంట వెల లేకా వెతలు....

వడ్డించినా చేయి... వట్టి పిడికిళ్లు... !! కర్షక!!

1) చరణం:-

కష్టాల్ని ప్రేమించి/ కర్రునాగలి నీ పట్టి..

భూతల్లిని నమ్మి/సాలిరుసుల దున్ని.....

"మొలకెత్తనీ విత్తనాలతో పోరు..

మోసపోయిన బ్రతుకే చితిపాలు.."

పండించిన నాపంట

వెలలేకా వెతలు....

వడ్డించినా చేయి...

వట్టి పిడికిళ్లు... !! కర్షక!!

2) చరణం;-

కర్మ ఫలమంటు...

ధర్మ యుద్దమే చేసే...

జన్మాంతం వరకు...

భూ సేద్యమే చెస్తే....

"పురుగమందులే ఆకలీ తీర్చి

పంట వడిలోనే ఒరిగెను రైతు "

పండించిన నాపంట...

వెలలేకా వెతలు....

వడ్డించినా చేయి...

వట్టి పిడికిళ్లు... !! కర్షక!!

Tags:    

Similar News