Mohan Babu vs Manchu Manoj: మోహన్ బాబు ఇంట్లో అసలు గొడవేంటి?

Update: 2024-12-13 01:30 GMT

Mohan Babu vs Manchu Manoj: మోహన్ బాబు ఇంట్లో అసలు గొడవేంటి?

Mohan Babu vs Manchu Manoj vs Manchu Vishnu family crisis explained: మోహన్ బాబు... మంచు మనోజ్... మంచు విష్ణు... గత మూడ్నాలుగు రోజులుగా ఏ న్యూస్ ఛానెల్ చూసినా అందులో పాపులర్‌గా వినిపిస్తున్న పేర్లివి. ఇంట్లో నాలుగు గోడల మధ్య మొదలైన ఆస్తుల పంచాయతీ, అన్నాదమ్ముల మధ్య విబేధాలు ఇంటి గేటు దాటుకుని రోడ్డుమీదకొచ్చేశాయ్. అంతేకాదు... పోలీసు స్టేషన్ వరకు వెళ్లి ఆ తరువాత కోర్టు మెట్లెక్కే వరకు పరిస్థితి వెళ్లింది. మోహన్ బాబుపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది.

ఈ గొడవ కాస్తా మీడియాపై దాడితో మరో మలుపు తీసుకుంది. అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది? ఎందుకు ప్రైవేట్ మ్యాటర్ కాస్తా పబ్లిక్ మ్యాటరైంది? ఈ మొత్తం వివాదంలో మోహన్ బాబు వెర్షన్ ఏంటి? మంచు మనోజ్ చేస్తోన్న ఆరోపణలేంటి? పెద్ద కొడుకు మంచు విష్ణు పాత్ర ఏంటి? బిడ్డ మంచు లక్ష్మి ఏం చేస్తోంది? ఇంతకీ ఇది ప్రైవేట్ పంచాయతీ అనుకోవాలా లేక పబ్లిక్ పంచాయతీ అనుకోవాలా అనేదే నేటి ట్రెండింగ్ స్టోరీ.

Full View

ఏ ఇంట్లో అయినా ఆస్తుల పంచాయితీ చాలా కామన్‌గా కనిపిస్తుంది. అన్నాదమ్ముళ్లన్నాక తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్లీ టైమొచ్చినప్పుడు కలిసిపోతారు. ఇది కూడా అంతే కామన్. కానీ ఆ పంచాయతీ కాస్త ఇంటి గేటు తీసుకుని రోడ్డుమీదకొచ్చిందో... ఇక అంతే సంగతి. ఆ తరువాత అది ఇరుగుపొరుగు పెట్టుకునే ముచ్చటకు ముడిసరుకు అవుతుంది. మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం విషయంలో సరిగ్గా అదే జరిగింది.

మొదటి నుండి ఎప్పుడేం జరిగిందంటే..

మంచు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన ఈ వివాదం డైలీ సీరియల్ తరహాలో రోజుకో మలుపు తిరుగుతోంది.ఈ ఎపిసోడ్ డిసెంబర్ 8 నాడే మొదలైనప్పటికీ... ఈ వివాదం రెండేళ్ల క్రితం నుండే నివురుగప్పిన నిప్పులా ఉంటోందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఆ వివాదం ఏంటో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలేంటి? అసలు వారి మధ్యలో ఎక్కడ గొడవొచ్చింది? ఎందుకు ఆ వివాదం పెరిగిపెద్దదయిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వివాదంలో అదే ఫస్ట్ సీన్

తన ఇంట్లోనే తనపై దాడి జరిగిందంటూ డిసెంబర్ 8 నాడు మంచు మనోజ్ 100 కు డయల్ చేశారు. అదే సమయంలో మోహన్ బాబు కూడా 100 కు డయల్ చేసి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. వెంటనే పోలీసులు జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. పోలీసులు లోపలికి వెళ్లి బయటికొచ్చారు. ఇది మా ఇంటి గొడవని, ఇంట్లోనే పరిష్కరించుకుంటామని వారు సర్దిచెప్పినట్లుగా పోలీసులు మీడియాకు తెలిపారు. సమస్య ఏదైనా ఉంటే పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పి పోలీసులు వెళ్లిపోయారు. లోపలేం జరిగిందో బయటకు రానివ్వకుండా మంచు మనోజ్ కుటుంబం జాగ్రత్తపడింది. కానీ ఈ వివాదంలో ఇది ఫస్ట్ సీన్ మాత్రమేనని ఆ తరువాత జరిగిన పరిణామాలు చెబుతున్నాయి.

ఇక్కడ సీన్ కట్ చేస్తే... అదే రోజు సాయంత్రం మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి నడవడానికి ఇబ్బందిపడుతూ వచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. జల్‌పల్లిలోని తమ ఇంట్లో తమపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఆ తరువాత పహాడీషరిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన భార్యకు మోహన్ బాబు కుటుంబం నుండి ప్రాణ హాని ఉందని ఆ ఫిర్యాదులో చెప్పారు. గన్ మెన్లతో రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరారు.

మరోవైపు కొడుకు చేసిన పోలీస్ కంప్లయింట్ సీన్‌నే అవతలివైపు మోహన్ బాబు కూడా రిపీట్ చేశారు. తనకు తన కొడుకు మంచు మనోజ్ కుటుంబం నుండి ప్రాణ హానీ ఉందని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.

ఇంటి చుట్టు మంచు విష్ణు బౌన్సర్లు

ఆ తరువాత జల్‌పల్లిలోని ఇంటికి వెళ్లిన మంచు మనోజ్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. ఆ సమయంలో దుబాయ్‌లో ఉన్న మంచు విష్ణు అక్కడి నుండే తండ్రి మోహన్ బాబుతో టచ్‌లో ఉన్నారు. మంచు విష్ణు ఏర్పాటు చేసిన బౌన్సర్లు మంచు మనోజ్‌ను లోపలికి రానివ్వకుండా ఇంటి బయట కాపలాగా ఉన్నారు. దీంతో మంచు విష్ణు బౌన్సర్లకు, మనోజ్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

సీన్‌లోకి మంచు లక్ష్మి ఎంట్రీ

మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవ మొదలై అప్పటికే 24 గంటలు దాటిపోయింది. పరిస్థితిని చక్కబెట్టేందుకు మోహన్ బాబు బిడ్డ మంచు లక్ష్మీప్రసన్న రంగంలోకి దిగారు. హుటాహుటిన ముంబై నుండి నేరుగా తమ్ముడు మంచు మనోజ్ ఇంటికి చేరుకున్నారు. లోపలేం జరిగిందో తెలియదు కానీ ఆమె ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా మోహన్ బాబు ఇంటికి వెళ్లిపోయారు.

ఎయిర్ పోర్టులోనే మంచు విష్ణును చుట్టుముట్టిన మీడియా

మంచు విష్ణు దుబాయ్ నుండి వస్తున్నాడని తెలిసి మీడియా ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అక్కడే ఆయన ముందు మైక్ పెట్టింది. ఇది అన్ని ఇళ్లలో జరిగే వివాదం లాంటిదేనని, ఇంట్లోనే పరిష్కారించుకుంటామని చెప్పి వెళ్లిపోయారు.

వైరల్‌గా మారిన మోహన్ బాబు ఆడియో

మంచు మనోజ్ గురించి సంచలన ఆరోపణలు చేస్తూ మోహన్ బాబు ఓ ఆడియో విడుదల చేశారు. మంచు విష్ణు, మంచు లక్ష్మి కంటే నిన్నే ఎక్కువ గారాబం చేశానని, కానీ నువ్వు గుండెలపై తన్నావని అన్నారు. భార్య భూమా మౌనిక రెడ్డి వచ్చిన తరవాత మంచు మనోజ్ ఆమె మాట వింటూ చెడుగా ప్రవర్తిస్తున్నట్లు మోహన్ బాబు ఆరోపించారు. మద్యానికి బానిసైన మనోజ్ తాను ఇంట్లో లేనప్పుడు పని వాళ్లపై దాడి చేసినట్లు చెప్పారు. తాను ఆపకపోయి ఉంటే ఆ పని వాళ్లే మనోజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసేవారన్నారు.

ఇంట్లో చిచ్చు పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వినయ్ మహేశ్వర్

తమ ఇంట్లో చిచ్చు పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వినయ్ మహేశ్వర్‌కు కూడా మోహన్ బాబు మద్దతు ఇచ్చారు. మోహన్ బాబు యూనివర్శిటీ పనుల విషయంలో తమకు సాయం చేస్తోన్న వినయ్ అనే వ్యక్తిపైనా మనోజ్ దుర్భాషలాడినట్లు మోహన్ బాబు ఆ ఆడియోలో ఆరోపించారు.

ఈ ఆస్తిలో నీకు హక్కు లేదు

జల్‌పల్లి నివాసం తన సొంత కష్టార్జితమని మోహన్ బాబు అన్నారు. ఈ ఆస్తిలో మనోజ్‌కు వాటా లేదన్నారు. తాను ఆస్తిని ఎవరికైనా రాసిస్తానా లేదా దానధర్మాలు చేస్తానా అనేది పూర్తిగా తన వ్యక్తిగతమేనని మోహన్ బాబు తేల్చిచెప్పారు.

నా గొడవ ఆస్తి కోసం కాదు...

మంచు మనోజ్ అంతకంటే ముందే మీడియాతో మాట్లాడుతూ నా గొడవ ఆస్తి కోసం కాదని, ఆత్మాభిమానం కోసం తాను పోరాడుతున్నానని చెప్పుకొచ్చారు. మరోవైపు మోహన్ బాబు అలా మాట్లాడటానికి, అసలు ఈ గొడవలు జరగడానికి మూల కారణం మాత్రం ఆస్తి పంపకాలే అని వార్తలొస్తున్నాయి. మోహన్ బాబు యూనివర్శిటీతో పాటు తిరుపతిలోని విద్యానికేతన్ వీరి కుటుంబానికి ప్రధాన ఆదాయవనరులుగా తెలుస్తోంది. అయితే, ఆ రెండింటిలోనూ మంచు విష్ణు పెత్తనమే నడుస్తోందని, తనకు వాటాలు ఇవ్వడం లేదనేది మంచు మనోజ్ వాదనగా ఫిలింనగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మీడియాలోనూ ఇదే రకమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.

నా బిడ్డను తీసుకెళ్తా

డిసెంబర్ 10 మంగళవారం సాయంత్రం వేళ మరోసారి మంచు మనోజ్ జల్‌పల్లిలో ఉన్న ఇంటికి వెళ్లారు. లోపల తన బిడ్డ ఉందని, ఆమెను తీసుకెళ్లేందుకే వచ్చానని చెప్పారు. కానీ మోహన్ బాబు పర్సనల్ సెక్యురిటీ, బౌన్సర్లు మంచు మనోజ్‌ను లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మొత్తం మీడియా కెమెరాలు అటువైపే ఫోకస్ చేశాయి. జనం కన్నార్పకుండా చూశారు. అప్పుడే ఊహించని ఘటన జరిగింది.

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు

మంచు మనోజ్ ఎలాగోలా గేటును తోసుకుని లోపలికి వెళ్లిపోయారు. మీడియా కూడా ఆ వివాదం కవర్ చేస్తూ అలాగే కాంపౌండ్ వాల్ లోపలికి వెళ్లింది. మంచు మనోజ్ లోపలికి వచ్చాడని తెలుసుకున్న మోహన్ బాబు ఆవేశంగా బయటికొచ్చారు. అదే ఆవేశంతో తనని ప్రశ్నలు అడుగుతున్న మీడియాపై మైక్ లాక్కొని దాడి చేశారు. ఆ దాడిలో గాయపడిన మీడియా ప్రతినిధి ఆస్పత్రిపాలయ్యారు. ఆ దృశ్యాలు అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి వరకు మోహన్ బాబు vs మంచు మనోజ్ అన్నట్లుగా నడిచిన పంచాయతీ కొత్త టర్న్ తీసుకుంది. మోహన్ బాబు దాడిని నిరసిస్తూ జర్నలిస్ట్ సంఘాలు రోడ్డెక్కాయి.

మోహన్ బాబు అహంకారానికి నిదర్శనం

జర్నలిస్టులపై దాడి మోహన్ బాబు అహంకారానికి నిదర్శనంగా సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టులపై దాదాగిరిని సహించే పరిస్థితే లేదన్నారు. ప్రభుత్వం కూడా ప్రేక్షక పాత్ర వహించకుండా మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మోహన్ బాబూ.. ఇది సినిమా కాదు

సినిమాల్లో నటించే వాళ్లు సినిమాల్లో 100 మందిపై దాడి చేసి చంపేసినా వాళ్లపై కేసులుండవు. మోహన్ బాబు కూడా ఆ భ్రమలో ఉండటం వల్లే ఈ దాడి చేశారని సీనియర్ జర్నలిస్ట్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్ అన్నారు. ఇది సినిమా కాదు. వాస్తవ ప్రపంచం అని మోహన్ బాబు గుర్తించాలన్నారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన మరోసారి గుర్తుచేశారు.

కావాలని చేసిన దాడి కాదంటున్న మోహన్ బాబు, మంచు విష్ణు

జర్నలిస్టులపై కావాలని దాడి చేయలేదని మోహన్ బాబు, మంచు విష్ణు చెప్పుకొచ్చారు. అది అనుకోకుండా జరిగిన పరిణామంగానే వారు అభిప్రాయపడ్డారు. జరిగినదానికి చింతిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు తన తండ్రి మోహన్ బాబు తరపున తాను సారీ చెబుతున్నట్లు మంచు మనోజ్ మీడియాకు క్షమాపణలు చెప్పారు.

మోహన్ బాబుపై క్రిమినల్ కేసు, గన్ సీజ్

మోహన్ బాబు మీడియాపై దాడి చేశారన్న ఫిర్యాదుతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ మొత్తం వివాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే మంచు మనోజ్ రాచకొండ సీపీ ఎదుట విచారణకు హాజరై తన వెర్షన్ వినిపించారు. మోహన్ బాబు అనారోగ్యం కారణంగా ఆయనతో పాటు మంచు విష్ణు ఈ విచారణకు హాజరు కాలేకపోయారు. అదే సమయంలో ఆయన తెలంగాణ హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు... డిసెంబర్ 24వ తేదీ వరకు పోలీసుల నోటీసులపై స్టే విధించింది. ఇది మోహన్ బాబుకు తాత్కాలిక ఊరట. ఏదేమైనా మీడియాపై దాడి విషయంలో ఆయన కోర్టు కేసులు ఎదుర్కోక తప్పదని లీగ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

ఇంతకీ ఇది పర్సనల్ మ్యాటరా? పబ్లిక్ మ్యాటరా?

ఇది మా ఇంటి విషయం అని మోహన్ బాబు చెబుతున్నారు. మీడియా అనవసరంగా జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై నెటిజెన్స్ స్పందిస్తూ మరో రకమైన అభిప్రాయం వినిపిస్తున్నారు. సినిమా వాళ్లు తమ బర్త్ డే పార్టీలు, పెళ్లిళ్లు పేరంటాలు, సినిమా ఫంక్షన్లకు మీడియా వాళ్లను పిలిచి మరీ హంగామా చేస్తుంటారు. మీడియాలో తమని తాము చూసుకుని మురిసిపోతుంటారు. అలాంటప్పుడు ఇలాంటి విషయాలను పర్సనల్ మ్యాటర్ అని ఎలా కొట్టిపారేస్తారని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. అందులోనూ ప్రజా జీవితంలో ఉంటూ సినిమాల్లో పది మందికి ఆదర్శంగా కనిపించే సినీ ప్రముఖులపై ఆ ఫోకస్ ఇంకాస్త ఎక్కువే ఉంటుందంటున్నారు. ఏదేమైనా ఎప్పుడైతే ఇల్లు దాటి పోలీసు స్టేషన్ మెట్లెక్కి ఆ తరువాత కోర్టు వరకు వెళ్లారో... అప్పుడే అది పబ్లిక్ అయిపోయిందనేది వారి అభిప్రాయం.

Tags:    

Similar News