Ys Sharmila: వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ జెండా ఎలా ఉందో తెలుసా

Ys Sharmila: వైఎస్ షర్మిల పార్టీ జెండాలో 80 శాతం మేరకు పాలపిట్ట రంగు, మిగిలిన 20 శాతం నీలం రంగు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Update: 2021-07-04 03:08 GMT

Ysrtp Ys Sharmila

Ys Sharmila: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కొత్తగా ఏర్పాటు చేయనున్న వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ జెండా ఖరారైంది. పార్టీని ఈనెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట రంగులో రూపొందించడం గమనార్హం. జెండాలో 80 శాతం మేరకు పాలపిట్ట రంగు, మిగిలిన 20 శాతం నీలం రంగు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చిత్రం ఉండేలా రూపొందించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ ఉత్సవాన్ని హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని జేఆర్సీ సెంటర్‌లో నిర్వహించడానికి పార్టీ వర్గాలు సమాయత్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం లోటస్‌పాండ్‌లోని షర్మిల కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ మహోత్సవానికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు. 8వ తేదీన నూతన పార్టీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివంగత నేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి విగ్రహాలను పూలతో అలంకరించాలని వైఎస్‌ విగ్రహాల పరిరక్షణ కమిటీ కోఆర్డినేటర్‌ నీలం రమేశ్‌ పిలుపునిచ్చారు.

వైఎస్ షర్మిల ఈ నెల 8వ తేదీన ఉదయం ఇడుపుల పాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుండి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రానికి చేరుకోనున్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలవేసి నివాళులు అర్పించనున్నారు. ఇక, సాయంత్రం నాలుగు గంటలకు జేఆర్సీ కన్వేషన్‌కు చేరుకుని పార్టీ కార్యకర్తల మధ్య పార్టీని ప్రకటించి లోగోను ప్రారంభించనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News