YS Sharmila: ఈ నెల 8న అధికారికంగా పార్టీ ప్రకటన
YS Sharmila: జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్ వేదికగా అనౌన్స్‌మెంట్ * అనుచరులు, అభిమానుల నడుమ జెండా, ఎజెండా ప్రకటన
YS Sharmila: చారిత్రాత్మక ఘట్టానికి వైఎస్ షర్మిల సమాయాత్తమౌతోన్నారు. తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీని నెలకొల్పడానికి ముహూర్తం సమీపిస్తోంది. తన తండ్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8న అధికారికంగా పార్టీని ప్రకటించనున్నారు. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ ప్రకటన వేదిక ఖరారైంది. షెడ్యూల్ ఫిక్స్ అయింది.
పార్టీ ప్రకటన కోసం తొలుత భారీగా జన సమీకరణ చేసి అంగరంగ వైభవంగా చేపట్టాలని నిర్ణయించారు. కానీ కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఫిలింనగర్ సమీపంలోని మణికొండ-దర్గా వద్ద ఉన్న జేఆర్ సీ కన్వెన్షన్ హాల్ లో పార్టీ ఏర్పాటు వేడుకను నిర్వహించనున్నారు. అనుచరులు, వైఎస్సార్ అభిమానుల నడుమ పార్టీ జెండా, ఎజెండాను షర్మిల ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి పార్టీ విధివిధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా పార్టీ ప్రకటన చేపట్టిన అనంతరం రెండు, మూడు వారాల్లోనే పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లేందుకు షర్మిల ప్రణాళికలు చేసుకున్నారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల తను పెట్టబోయే పార్టీ పేరును వైఎస్సార్ టీపీ గా ఇటీవలే ప్రకటించింది. జెండా కూడా ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. తను పెట్టబోయే పార్టీకి చెందిన జెండా తన అన్న జగన్ పార్టీ వైసీపీకి చెందిన జెండాను పోలినట్లే ఉంటుందని లోటస్ పాండ్ వర్గీయులు చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ జెండాలో పాలపిట్ట రంగు 80 శాతం, లేత ఆకుపచ్చ రంగు 20 శాతం ఉంటాయని... జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్ ఉంటుందంటున్నారు. పాలపిట్ట రంగు సమన్యాయం, సమానత్వం, సంక్షేమానికి చిహ్నంగా.., ఆకుపచ్చ కలర్ రైతులకు, అభివృద్ధికి చిహ్నాలుగా ఉండేలా ఈ రంగులకు షర్మిల ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక వైఎస్ షర్మిల తను తెలంగానలో పెట్టబోయే పార్టీకి ఎజెండాను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. తన ఎజెండాలో ప్రధానంగా ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళల భద్రత, నిరుద్యోగ సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
ప్రజల కీలక సమస్యలపై పోరాడుదామని షర్మిల అనుకున్నప్పటికీ ఆమె చుట్టూ ఉన్న కోటరీ వల్ల విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమె చేపట్టిన జిల్లాల పర్యటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. జన సమీకరణ చేయడంలో వారు జిల్లాస్థాయి నేతలు, కార్యాకర్తలతో సమన్వయం చేయలేకపోతున్నట్లు షర్మిల భావిస్తోంది. చూడాలి భవిష్యత్ పార్టీ ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుందో.