పున: నిర్మాణం పనులతో కొత్తరూపు దిద్దుకుంటున్న యాదాద్రి

Update: 2020-08-20 02:24 GMT

Yadadri Turns into excellent new shape with reconstruction works: యాదాద్రి పుణ్యక్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు తరలి వచ్చేలా అద్భుతంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేలా అక్కడ పచ్చదనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానితో గోపురం పరిసర ప్రాంతం అరణ్యాలు, గార్డెన్లు, చెట్ల మొక్కలు, రంగురంగుల పూల మొక్కలతో గ్రీన్ జోన్ గా మారిపోయింది. యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మిస్తోంది. దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులతో యాదాద్రిలో ఎక్కడ చూసిన కొత్త నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు యాదగిరిగుట్టను చూసిన వారు ఇపుడు యాదాద్రిని చూస్తే ఆ ప్రాంత అభివృద్ధిని అసలు నమ్మలేకపోతున్నారు. భక్తులకు స్వామి వారి దర్శనం ఎంత ముఖ్యమో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కూడా అంతే లక్ష్యంగా వైటీడీఏ పనులను చేపడుతోంది.

యాదాద్రికి వెళ్లే ప్రధాన రహదారులు పచ్చని చీర కట్టినట్లు భక్తులను ఇట్టే ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ ‌నుంచి వచ్చే వారికి మొదటగా రాయగిరి దగ్గర నుంచి నాలుగు లేన్ల రహదారికి ఇరువైపులా పూల మొక్కలు, ల్యాండ్ స్కేప్ ఆకట్టుకుంటుంది. ఎడమ వైపు కొండలపై నరసింహ అభయారణ్యం అధ్బుతమైన రీతిలో నిర్మించి, అందులో జంతువుల బొమ్మలను అతి సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ నుంచి రాయగిరి చెరువు దగ్గర కట్టపై రోడ్డు కిరువైపులా ల్యాండ్ స్కేప్ తో పాటు రకరకాల పూలమొక్కలు ఏర్పాటు చేసారు. ఆ తర్వాత వడాయిగూడెం దగ్గర కొండలపై నిర్మించిన అంజనేయ అభయారణ్యం భక్తులను, పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

వడాయిగూడెం నుంచి యాదాద్రి మెయిన్ టెంపుల్ వరకు రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లు, మొక్కలు స్వామి వారి దర్శనానికి స్వాగతం పలికేలా మనకు దర్శనమిస్తాయి. అటు నుంచి యాదాద్రి కొండపైకి వెళ్లే క్రమంలో ఘాట్ రోడ్డుకిరువైపులా పచ్చని ల్యాండ్ స్కేప్ భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక స్వామివారు కొలువై ఉన్న ప్రధాన ఆలయం ఏకశిలతో నిర్మాణం అయ్యింది. దీని కోసం భారీ స్థాయిలో రిటైనింగ్ వాల్స్ నిర్మించారు. ఇపుడు రిటైనింగ్స్ వాల్స్ కూడా పచ్చటి చెట్లు మొక్కలతో సుందరంగా కనిపిస్తున్నాయి. యాదాద్రి టెంపుల్ లో మొత్తం నిర్మాణం రాతితో, ఏకశిలలతో చేపడుతుండగా అంతే స్థాయిలో ఆహ్లాదం కోసం పచ్చని చెట్లు మొక్కలతో పాటు అడుగడుగునా ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కేప్ గార్డెన్ లు భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Full View



Tags:    

Similar News