World Elephant Day: ఉత్సాహంగా ఎలిఫెంట్ డే.. జూలో ఏనుగులకు సత్కారం
World Elephant Day: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా నగరంలోని జూలో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
World Elephant Day: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా నగరంలోని జూలో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏనుగులను ప్రత్యేకంగా సన్మానించారు. కొన్నేళ్లుగా జూలోనే ఉంటున్న 82 వయస్పున్న గజరాజును ప్రత్యేకంగా అభినందించారు.
నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఒక గజ 'రాణి' అరుదైన రికార్డును సృష్టించింది. సాధారణ జీవిత కాలం కంటే ఎక్కువ రోజులు బతికి 82 నాటౌట్‌గా నిలిచింది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి నగర సందర్శకులను కనువిందు చేస్తున్న 'రాణి'కి ఎలిఫెంట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రత్యేక సన్మానం జరిగింది. షెవర్ బాత్ చేయించడంతో పాటు ప్రత్యేక పండ్లు, ఫలహారాలను అందించి ఖుషీ చేశారు.పూల దండలు వేసి గౌరవించారు. సాధారణంగా ఏనుగుల జీవిత కాలం అడవులలో 50నుంచి 60సంవత్సరాల వరకు ఉంటుంది. అదే నెహ్రూ జూలోని 'రాణి' అనే ఏనుగు ఎనిమిది దశాబ్దాలకుపైగా మనుగడ సాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఎక్కువ కాలం బతికిన ఏనుగులలో దేశంలోనే టాప్‌టెన్ జాబితాలో నిలిచింది. జూ పార్కులలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కానీ దేశవ్యాప్తంగా జూపార్కులలో మాత్రం 'రాణి' దే రికార్డు అని అంటున్నారు.
రాణి 7అక్టోబర్ 1938లో జన్మించింది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో జూపార్క్ ఉన్నప్పటి నుంచి సందర్శకులను అలరిస్తున్నది. 1963లో బహుదూర్‌పురాలో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఏర్పాటైన తర్వాత 'రాణి'ని ఇక్కడికి తరలించారు. ఈ ఏనుగు జూపార్క్ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. జూ సిబ్బందిని, అధికారులను 'రాణి' గుర్తుపట్టి ఆప్యాయంగా తరుచూ తన తొండంతో నిమురుతూ తన కృతజ్ఞతను తెలియజేస్తుంటుంది.
రాణి తర్వాత ఎక్కువ వయస్సున్న ఏనుగు రజనీ. ఈ ఏనుగు నగరంలోని మొహర్రం, బోనాల వంటి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. హైదరాబాద్‌లోని నిజాం ట్రస్టు వారు 1990లో ఈ ఏనుగును జూపార్క్‌కు బహుమానంగా ఇచ్చారు. ప్రస్తుతం జూపార్క్‌లో ఉన్న ఐదు ఆసియాటిక్ జాతికి చెందిన ఏనుగులు సందర్శకులను అలరిస్తున్నాయని జూ క్యూరేటర్ క్షతిజ తెలిపారు. రాణి అనే ఏనుగు 82ఏండ్లు దాటినా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం అరుదైన రికార్డు అని ఆమె వెల్లడించారు.