మరో ఘనత సాధించిన సిరిసిల్ల నేతన్న.. చీరలపై చిత్రాలు నేస్తున్న వెల్ది హరిప్రసాద్
పట్టు వస్త్రంపై వేసిన వినాయకుడి చిత్రాన్ని తెలంగాణ బ్యాడ్మింటన్ వైస్ చైర్మన్ చాముండేశ్వరీ నాథ్ ఇండియన్ మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు అందజేసినట్టు హరిప్రసాద్ తెలిపారు.
చేనేత కళలకు సిరిసిల్ల కేరాఫ్‌గా నిలుస్తోంది. నేత కార్మికులు తమ కళాత్మకతతో అద్భుతాలు చేస్తూ అందరిని అబ్బుర పరుస్తున్నారు. మరమగ్గాలతో కూడా కళా చిత్రాలను నేస్తూ సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అగ్గిపెట్టలో ఇమిడే చీర.. సూదిలో దూరే చీరలను నేసిన నేతన్నలు ఇప్పుడు మరో అద్భుతాన్ని చేసి చూపించారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వెల్ది హరిప్రసాద్ నేత కార్మికుడు. తన వృత్తిలో కళాత్మకతను పుణికి పుచ్చుకున్నాడు. తన ప్రతిభతో వస్త్రాలపై అద్భుత చిత్రాలను నేస్తున్నాడు. గతంలో అగ్గి పెట్టలో ఇమిడే చీర.. సూదిలో దూరే చీరలను నేసి ప్రముఖుల ప్రశంసలు పొందాడు.
ఇటీవల రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ చిత్రాన్ని శాలువపై నేసి అబ్బురపరిచాడు. హరిప్రసాద్ వేసిన చిత్రాన్ని ముగ్ధుడైన మంత్రి కేటీఆర్.. అతడిని ప్రత్యేకంగా సత్కరించారు. పట్టు వస్త్రంపై వేసిన వినాయకుడి చిత్రాన్ని తెలంగాణ బ్యాడ్మింటన్ వైస్ చైర్మన్ చాముండేశ్వరీ నాథ్ ఇండియన్ మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు అందజేసినట్టు హరిప్రసాద్ తెలిపారు.
హరిప్రసాద్ కళా నైపుణ్యానికి మెచ్చి చాముండేశ్వరీ నాథ్ తన కూతురు చిత్రాన్ని పట్టుచీరపై బంగారంతో నేయించాడు. వెంకటేశ్వర స్వామి ప్రతిమతో కూడిన వీవీఐపీ శాలువలను బల్క్ గా చాముండేశ్వరీనాథ్ ఆర్డర్ చేశారు. ప్రత్యేక జకార్డు యంత్రంతో ఈ చిత్రాలను పట్టువస్త్రాలపై నేసినట్లు హరిప్రసాద్ తెలిపారు. పట్టు వస్త్రాలపై చిత్రాలతో సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తన లాంటి ప్రతిభవంతులు ఇంకా రావాలంటే ప్రభుత్వం నుంచి మద్ధతు కావాలంటున్నాడు హరి ప్రసాద్.. ప్రభుత్వ సహకారం అందితే సిరిసిల్ల పట్టుకు బ్రాండ్ నేమ్ తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హరి ప్రసాద్ పేర్కొన్నారు.