వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన హయత్ నగర్ కార్పోరేటర్‌కు చేదు అనుభవం ఎదురైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాలాల కబ్జాలతో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా మునిగిపోయింది. వాటితో పాటుగానే నగరంలోని పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో వరద పరిస్థితిని పరిశీలించేందుకు, ముంపునకు గురైన ప్రాంతాలను చూసేందుకు హయత్ నగర్ కార్పోరేటర్ సామా తిరుమల్ రెడ్డి వెళ్లారు. ఆదివారం ఉదయం బంజారా కాలనీని సందర్శించడానికి వెళ్లిన ఆయనను స్థానికులు నిలదీసి ప్రశ్నించారు. నాలా కబ్జాలే ముంపుకు కారణం అంటూ కోపోద్రిక్తులయ్యారు. గతంలో తాము నాలా భూములు కబ్జాకు గురి అవుతున్నాయని అధికారులు, కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క‍్రమంలో ఓ మహిళ కార్పోరేటర్ చొక్కా పట్టుకుని నిలదీశారు. అందరి ముందు ఓ మహిళ తన చొక్కాపట్టుకుని నిలదీయడంతో ఒక్కసారిగా కార్పోరేటర్ కంగు తిన్నారు. ఆ తర్వాత స్థానికులకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇక హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసీ నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చాదర్‌ఘాట్ నుండి మలక్‌పేట్, దిల్‌సుఖ్ నగర్ ప్రధాన రోడ్ పూర్తిగా బంద్ అయి రాకపోకలు నిలిచిపోయాయి. అంతే కాదు ఛాదర్ ఘాట్ బ్రిడ్జితో పాటు దానికి సమీపంలో ఉన్న బస్తీలను కూడా మూసీనది ముంచింది. దీంతో వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ వరదలకు సుమారు 50కి పైగా పేదల ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. మూసీనది ఒక్కసారిగా ఇంతటి ఉగ్రరూపం దాల్చడంతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాయకులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎవరూ వచ్చి తమని చూడలేదంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.