Telangana: కేసీఆర్‌ను టార్గెట్ చేసిన షర్మిల వ్యూహం సక్సెస్ అవుతుందా?
Telangana: వైఎస్ షర్మిల ఇప్పుడు ఈమె గురించి తెలంగాణ అంతటా చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగుతోన్న రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ఆసక్తి రేపుతోంది.
Telangana: వైఎస్ షర్మిల ఇప్పుడు ఈమె గురించి తెలంగాణ అంతటా చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగుతోన్న రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ఆసక్తి రేపుతోంది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ గడ్డపై కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్, కేసీఆర్‌పై సంకల్ప సభలో ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ దెబ్బతో షర్మిలను 'ఆంధ్రా బూచిగా చూపి ప్రచారాస్త్రంగా టీఆర్ఎస్ వాడుకోబోతోందా? షర్మిల విమర్శలు గుప్పిస్తుంటే టీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చింది?
తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పొలిటికల్ టీజర్ కాకరేపుతోంది. సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దూమారం రేపుతున్నాయి. ఖమ్మంలో షర్మిల నిర్వహించిన సంకల్ప సభ టీఆర్ఎస్ టార్గెట్‌గానే జరిగిందనే వాదన కూడా వినిపిస్తోంది. సభ ప్రారంభం నుంచి చివరి వరకు ఆసాంతం సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై షర్మిల విమర్శలు గుప్పించారు. వైఎస్ పాలనలో ప్రవేశ పెట్టిన పథకాలను, ప్రజా సంక్షేమాన్ని గుర్తుచేస్తూ ప్రస్తుతం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల తీరుపై విమర్శలు గుప్పించారు. వాటన్నింటిని ప్రశ్నించేందుకే నిలదీసేందుకు తాను పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కన పడేసిన కేసీఆర్ భజన బ్యాచ్‌ని పక్కన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ బానిస అయిందంటూ విమర్శల్లో మసాల దట్టించి రాజకీయాల్లో దుమారం రేపారు.
షర్మిల వ్యాఖ్యలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గడీల పాలన తెలంగాణలో లేదని, పులివెందులలో ఉందని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించడానికి, అలజడి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి కుట్రలను ప్రజలు తిప్పికొడుతారని హెచ్చరించారు.
సంకల్ప సభలో షర్మిల బీజేపీపై కూడా నిప్పులు చెరిగారు. దీంతో రాజన్న రాజ్యమంటే దాచుకోవడం దోచుకోవడమేగా అంటూ బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ ఎద్దేవా చేశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది రాజన్న రాజ్యమేనని తీవ్ర విమర్శలు గుప్పించారు. షర్మిల ప్రసంగం సీఎం కేసీఆర్ రాసి ఇచ్చిందేనని ఆరోపించారు.
అయితే షర్మిల ఇదంతా వ్యూహం ప్రకారమే చేశారని కొందరు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకొనే కాంగ్రెస్ కూడా ఈ రేంజ్‌లో కేసీఆర్‌ను ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ కూడా అనేక విషయాల్లో విమర్శించినా షర్మిల మాదిరిగా టార్గెట్ చేయలేదు. అయితే తెలంగాణను సాధించిన నాయకుడిగా ఇప్పటి వరకు కేసీఆర్‌కు ఉన్న ఇమేజ్‌ను ఎవరూచెరిపి వేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ విధానాలను విమర్శించే వారు కూడా కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించిన వారు లేరు. ఇలాంటి పరిస్థితిలో షర్మిల వచ్చీరావడంతోనే కేసీఆర్‌ను టార్గెట్ చేయడాన్ని ప్రజలు స్వీకరించే అవకాశం ఉందా? చూడాలి షర్మిల పొలిటికల్ వ్యూచర్‌పై ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయో?