అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగితే హైద‌రాబాద్‌లో తగ్గుతాయా?

Real Estate: నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ ప్రారంభమైంది.

Update: 2024-06-15 07:00 GMT

అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగితే హైద‌రాబాద్‌లో తగ్గుతాయా?

Real Estate: నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ ప్రారంభమైంది. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చంద్రబాబు ప్రకటించడంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ ఊపందుకుంది. ఈ ప్రభావం తెలంగాణలోని హైద్రాబాద్ పై ఉంటుందని రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమరావతి రియల్ ఎస్టేట్ బూమ్ హైద్రాబాద్ పై ఎఫెక్ట్ ఎంత?

చంద్రబాబునాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి టీడీపీ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకపక్ష తీర్పును ఇచ్చారు. కేంద్రంలోని ఎన్‌డీఏలో కూడా టీడీపీ చేరింది. ఈ పరిణామాలన్నీ అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్‌కు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం హైద్రాబాద్ నుండి పెట్టుబడులను ఎంతో కొంత అమరావతికి తరలిపోయేలా చేస్తుందని వారు భావిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ రియాల్టీ ధరలు 10-15 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

అమరావతి రియాల్టీ హైదరాబాద్‌ను మించిపోతుందా?

అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ హైద్రాబాద్‌తో పోల్చితే డబుల్ ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ నివేదిక ప్రకారంగా అమరావతిలో రియల్ బూమ్ హైద్రాబాద్ కంటే రెండింతలు ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో అమరావతి ప్రభావం గణనీయంగా ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. అయితే, అమరావతి రియాల్టీ వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ సానుకూలంగా మారుతుందని కూడా ఆ నివేదిక వెల్లడించింది. అమరావతికి పెట్టుబడులను ఆకర్షించేందుకు జరిగే ప్రయత్నాల వల్ల హైదరాబాద్‌కు కూడా అడ్వాంటేజ్ ఉంటుందన్నది ఆ నివేదికలోని సారాంశం. అమరావతిలో మౌలిక వసతులపై ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇది మొత్తంగా కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ పురోగతికి తోడ్పడుతుంది. హైదరాబాద్‌లో రియాల్టీ కార్యకలాపాలు సాగిస్తున్న భారీ సంస్థలు ఇప్పుడు అమరావతి వైపు పెట్టుబడులను తరలించడం వల్ల ఇక్కడ తాత్కాలికంగా ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నికలకు ముందు నుంచే అమరావతిలో రియల్ సందడి

అమరావతిలో ఈ ఏడాది జనవరి నుండి రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతూ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలు రెట్టింపయ్యాయని ఓ రియల్టర్ చెప్పారు. 2014-19 మధ్యకాలంలో అమరావతిలో ఎకరం భూమి రూ.20 లక్షల నుండి రూ.2,5 కోట్లకు చేరిందని ఆయన గుర్తు చేశారు. 2019లో జగన్ సీఎంగా ఎన్నికైన తర్వాత కొన్ని చోట్ల ధరలు 60 శాతం పడిపోయాయని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రేట్లకు రెక్కలు వస్తాయని, 2019కి ముందున్న స్థాయికి రావడమే కాకుండా మరింత పెరుగుతాయని వారంటున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల భూముల రిజిస్ట్రేషన్లు కూడా పెరిగాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతిలో రాజధాని కోసం చేపట్టిన భవనాలు ఏ దశలో ఉన్నాయో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఆగిపోయిన నిర్మాణాలు మళ్ళీ మొదలయ్యే సూచలను కనిపిస్తుండడం రియాల్టర్లకు ఉత్సాహాన్నిస్తోంది.

హైద్రాబాద్ రియల్ ఎస్టేట్‌పై ఎఫెక్ట్ ఎంత?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం హైద్రాబాద్ లో రియల్ ఏస్టేట్ వ్యాపారం కొంత మందకొడిగా ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు. అయితే, క్రమంగా హైద్రాబాద్‌లో రియల్ రంగం ఊపందుకుంటోందని వారంటున్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ జోరు పెరిగితే దానివల్ల హైద్రాబాద్ కు వచ్చే నష్టం ఏమీ ఉండదని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అభిప్రాయపడ్డారు. హైద్రాబాద్ గ్లోబల్ సిటీ కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయంగా ఆసక్తి మరింత పెరుగుతుందే కాని, తగ్గే అవకాశం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ... రెండు రాష్ట్రల్లోనూ ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. కేసీఆర్ హయాంలో, ముఖ్యంగా 2018లో ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ రియాల్టీకి ఆకాశమే హద్దు అన్నట్లుగా మారింది. ఆ సమయంలో ఏపీలో అమరావతి రాజధాని అంశాన్ని జగన్ పక్కన పెట్టడం, మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు తేవడం హైదరాబాద్‌కు అనుకూలంగా మారిందన్నది కాదనలేని వాస్తవం. అమరావతికి రూపకల్పన చేసిన చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావడంతో ఆ ప్రాంతానికి రాజధాని కళ వస్తోంది. అమరావతి ఇన్‌ప్రాస్ట్రక్చర్ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ప్రభావం హైదరాబాద్ రియాల్టీని కొంత కరెక్షన్‌కు గురి చేసినా, లాంగ్ రన్‌లో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. 

Full View


Tags:    

Similar News