హైదరాబాద్ మహానగరంలో, మహాయుద్దానికి జనసేన సై అనేసింది. బల్దియా బరిలో రెచ్చిపోదాం బ్రదర్ అంటోంది. మరి గ్రేటర్ ఎలక్షన్స్ క్యాంపెయిన్‌లో, వకీల్ సాబ్ పాల్గొంటారా? కాటమ రాయుడు వీరావేశంతో సర్కారుపై దండెత్తుతారా? కాషాయంతో పొత్తు వుంటుందా? సింగిల్‌గానే ఫైట్ చేస్తానంటారా? జనసేన పోటీ వెనక, కథా, స్క్రీన్ ప్లే, కాషాయమేనన్న వాదనలో నిజమెంత? నిజంగా జనసేన గ్రేటర్‌లో తొడగొడితే, గులాబీదళం కౌంటర్ స్ట్రాటజీ ఎలా వుండబోతోంది?
దుబ్బాక ఎన్నికల సంచలనంతో రాజకీయం వేడెక్కుతోంది. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తుండటంతో, పార్టీలన్నీ రెట్టించి కదనోత్సాహంతో గ్రౌండ్‌లోకి దూకేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. జీహెచ్‌ఎంసీలో పోటీ చేస్తానంటూ, గతంలోనూ చాలాసార్లు టీజర్లు విసిరిన జనసేన, ఇప్పుడు ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేసింది. బల్దియాపోరులో తలపడబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దుబ్బాక విజయంతో బీజేపీ ఊపుమీదవుండటం, అటు టీఆర్ఎస్ కసిమీదున్న నేపథ్యంలో, జనసేన ప్రకటన, గ్రేటర్ ఫైట్‌ను మరింత రసవత్తరం చేసింది. అయితే, జీహెచ్‌ఎంసీ పోటీ వెనక జనసేన వ్యూహమేంటి? ఈ పోటీ ఆలోచన ఎవరిది? ఆచరణ ఎలా వుండబోతోందన్నది ఆసక్తిగా మారింది.
బీజేపీతో పొత్తు వుంటుందా? అదే జరిగితే కమలానికి లాభమా..నష్టమా? గ్రేటర్‌లో జనసేన ఫైట్ అనగానే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఎందుకంటే, ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు వుంది. తెలంగాణలోనూ వుంటుందనుకుంటారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత, బండి సంజయ్ పవన్‌తో సమావేశం కూడా అయ్యారు. గ్రేటర్ ఎన్నికల కోసమే వీరు కలిశారన్న మాటలు అప్పుడు వినిపించాయి. ఇప్పడు కూడా జనసేన పోటీ చేస్తుందని చెప్పారు గానీ, బీజేపీతో పొత్తు వుంటుందా, వుండదా మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని, కాంగ్రెస్ నిండామునిగిన సందర్భం కమలాన్ని కలవరపరుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు, చాలారోజులు అన్నంతినలేదని పవన్ అనడం, ఇప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే. అందుకే జనసేనతో నేరుగా పొత్తుపై కమలం ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి.
సీమాంధ్ర ఓట్లు, కాపు వర్గం లెక్కలే జనసేన ఆశలా?
గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో సీమాంధ్ర ఓటర్లున్నారు. కార్పొరేటర్ల గెలుపోటములను ప్రభావితం చెయ్యగలరు. తెలంగాణ ప్రజానీకంలోనూ పవన్ కల్యాణ్‌కు, ఫాలోయింగ్ వుంది. ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ అభిమానుల ఓట్లపైనే జనసేన ఆశలు. అంతేకాదు, కాపువర్గం ఓట్లు కూడా చెప్పుకోగదగ్గ సంఖ్యలో వున్నాయి. ఇలా సీమాంధ్ర ఓట్లు, అటు కాపుసామాజికవర్గం లెక్కలు, బల్దియా బరిలో దిగడానికి జనసేననను ప్రేరేపిస్తుండొచ్చు.
పవన్ ప్రచారానికి వస్తారా? కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేస్తారా?
ఇది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. పవన్ ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొనడంపై అనేక సందేహాలున్నాయి పార్టీ శ్రేణులకు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి, ప్రచారానికి వస్తామని లీకులిచ్చి, చివరి నిమిషంలో కాదనుకున్నారు పవన్. ఇప్పుడు కూడా తెలంగాణ జనసేన నేతలు, పవన్ ప్రచారంపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ బీజేపీతో పొత్తువున్నా, లేకపోయినా, ఆయనే గనుక ప్రచారానికి వస్తే, గ్రేటర్ పోరులో అలజడే. కేసీఆర్‌పై నేరుగా విమర్శలు చెయ్యాల్సి వస్తే, గులాబీదళం ఊరుకునే రకం కాదు. గతంలో తెలంగాణపై పవన్ చేసిన కామెంట్ల క్యాసెట్లను బయటకు తీస్తుంది. తెలంగాణను వ్యతిరేకించిన పవన్‌కు, తెలంగాణలో పనేంటని ప్రశ్నించొచ్చు. మొన్న వరదల విరాళాలపైనా పవన్ విమర్శలపై, అధికార పార్టీ రగిలిపోతోంది. గ్రేటర్‌లో అదే జరిగితే, రచ్చ ఖాయం. కేసీఆర్, కేటీఆర్‌లాంటి వాళ్లు నేరుగా పవన్‌ను టార్గెట్ చెయ్యకపోయినా, కింది క్యాడర్ మాత్రం రచ్చరచ్చ చెయ్యడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే, పవన్ నేరుగా ప్రచారం చేస్తారా తెలంగాణ క్యాడర్‌కే వదిలేస్తారా అన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు విశ్లేషకులు.
జనసేనతో సీమాంధ్ర ఓట్లను చీల్చడమే కాషాయ వ్యూహమా?
జనసేనతో నేరుగా పొత్తు మొదటికే మోసమని, కాషాయంలోని ఓ వర్గం కస్సుమంటోంది. అందుకే డైరెక్ట్ ఫ్రెండ్‌షిప్ కాకుండా, ఎవరికివారే పోటీ చేసి, సీమాంధ్ర ఓట్లను చీల్చాలన్నది కమలం వ్యూహం కావచ్చన్నది ఒక విశ్లేషణ. సీమాంధ్ర ఓట్లు అధికంగా వుండే డివిజన్లలో, జనసేన పోటీ చేస్తే, అక్కడ బీజేపీ తరపున డమ్మీ అభ్యర్థులను పెట్టి, ఇన్‌డైరెక్ట్ సపోర్ట్ చెయ్యొచ్చు. గత బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్‌కే సీమాంధ్ర జనం ఓటేసిన నేపథ్యంలో, ఆ ఓట్లను చీల్చి, అధికార పార్టీని దెబ్బతియ్యాలన్నది కాషాయ వ్యూహంలో భాగం కావొచ్చని కొందరంటున్నారు.
పవన్‌కు కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ ఎవర్ని రంగంలోకి దింపుతుంది?
సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లోనే వుండటంతో, కేసీఆర్ ప్రభుత్వంపై వేలెత్తి చూపడానికి చిత్ర ప్రముఖులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది పవన్ కల్యాణ్ గనుక మాటల తూటాలు పేల్చితే, గులాబీదళం సైతం, సినిమావాళ్లతోనే ఆయనకు కౌంటర్ ఇప్పించడం ఖాయం. ఇప్పటికే చిరంజీవి, నాగార్జునలు కూడా, కేసీఆర్‌తో క్లోజ్‌గా వుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, టీఆర్ఎస్ ప్రభుత్వంతో పవన్ నేరుగా తలపడే పరిస్థితులు మాత్రం, ఇప్పుడు కనపడ్డం లేదు. గ్రేటర్‌పై ఎలాగైనా జెండా ఎగరెయ్యాలని కాషాయ అధష్టానం డిసైడైతే మాత్రం, పవన్ కూడా అదే రేంజ్‌లో చెలరేగిపోవచ్చు. కానీ అలా జరుగుతుందా అన్నది అనుమానమేనంటున్నారు విశ్లేషకులు.
మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించడం, రకరకాల ఊహాగానాలకు ఆస్కారమిస్తోంది. అనేక ప్రశ్నలూ ఉదయించేలా చేస్తోంది. మరి ఏపీ తరహాలో, గ్రేటర్‌లోనూ పొత్తు పెట్టుకుంటారా? ఒంటరిగానే రంగంలోకి దిగుతారా? పవన్ ప్రచారానికి వస్తారా? రారా? సీమాంధ్ర ఓటర్లు పవన్‌ను ఆదరిస్తారా? చంద్రబాబు తరహాలోనే లైట్ తీసుకుంటారా? టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయి? గ్రేటర్‌లో నిజంగా పవన్ ఫ్యాక్టర్ పని చేస్తుందా? అన్న ప్రశ్నలకు, రాబోయే కాలమే సమాధానం ఇవ్వాలి.